అయోధ్యలో రామమందిరం నిర్మాణం కల సాకారమవుతున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చందాలు, విరాళాలు సేకరిస్తోన్న సంగతి తెలిసిందే. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక అయిన రామ మందిర నిర్మాణం కోసం భారీగా విరాళాలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ తారలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు రామ మందిర నిర్మాణానికి విరాళాలు సమర్పించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రామ మందిరం విరాళాలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడి పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని, రామ మందిరం పేరుతో కొందరు మోసపూరితంగా వసూళ్లు కొనసాగిస్తున్నారని ఉద్ధవ్ షాకింగ్ కామెంట్లు చేశారు. అలా వసూలు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని శివసేన కార్యకర్తలకు ఉద్ధవ్ సూచించారు.
అలాంటి మోసపూరిత వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పించి, మోసాలకు బలికాకుండా చూసుకోవాలని తన పార్టీ కార్యకర్తలకు ఉద్ధవ్ సూచననిచ్చారు. అయితే, పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా చందాలకు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాబట్టి, బీజేపీని, ఆ సంస్థలను ఉద్దేశించే ఉద్ధవ్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
కాగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రస్తుతానికి వెండి ఇటుకలు పంపవద్దని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. వెండి ఇటుకలను భద్రపరిచేందుకు బ్యాంకు లాకర్లలో స్థలం లేదని తెలిపింది. భక్తుల మనోభావాలను తాము అత్యంత శ్రద్ధతో అర్థం చేసుకుంటామని, లాకర్లలో స్థలం సమస్య పరిష్కారమయ్యే వరకు సహకరించాలని కోరింది.