2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఏపీ, తెలంగాణల మధ్య స్నేహబంధం కొనసాగింది. అయితే, ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమిపాలుకావడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జగన్, కేసీఆర్ ల మధ్య బంధం తెగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీతో సంబంధాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలు కొనసాగిస్తుందని రేవంత్ అన్నారు. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిని కలుస్తానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని రేవంత్ తెలిపారు. కుటుంబసమేతంగా బుధవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా పవిత్రమైన తిరుమల కొండపై రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని, ఈ ఏడాది వర్షాలు కూడా సమృద్ధిగా కురిసి ప్రభుత్వానికి ప్రకృతి సహకరిస్తోందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగాలని రేవంత్ ఆకాంక్షించారు.
ఇక, తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం నిర్మించే యోజన చేస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ సీఎంను కలిసి ఈ విషయంపై చర్చిస్తామన్నారు. సత్రంతోపాటు అవకాశాన్ని బట్టి కల్యాణ మండపం కూడా నిర్మించి భక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామన్నారు.