ఉమ్మడి ఏపీ విడిపోయి పదేళ్లు గడిచినా విభజనానంతర సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో విభజన తర్వాత అంశాలపై చర్చల కోసం ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు రేవంత్ రెడ్డి స్వయంగా ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించిన చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. చంద్రబాబును శాలువతో రేవంత్ సత్కరించారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు వెంకటేశ్వర స్వామి పటాన్ని బహూకరించారు. 10 అంశాల అజెండాపై ఇద్దరి మధ్య చర్చ సాగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పాల్గొన్నారు. సీఎస్ శాంతికుమారి, మరికొందరు అధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబు వెంట మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తదితరులు ఉన్నారు. ఖమ్మంలోని ఏడు మండలాలు, నీటిలో వాటా, తొమ్మిది, పదో షెడ్యూల్లలోని ఆస్తుల పంపకాలు, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల విభజన, హైదరాబాద్లోని భవనాల అప్పగింత తదితర అంశాలపై వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ కావడానికి ముందు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ సీఎంతో భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు.