మచ్చలేని ముఖ్యమంత్రిగా ఇంతకాలం పేరున్న కేరళ సీఎం చిక్కుల్లో పడ్డారా? మిస్టర్ క్లీన్ కాదు.. లెక్క తేడానా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్యన కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో సీఎం పాత్ర ఉందన్న మాట వినిపించింది. అయితే.. ఆ తర్వాత ఆ కేసు విచారణ పెద్దగా ముందుకు పడలేదు. ఇదిలా ఉండగా.. కీలకమైన ఎన్నికల వేళ.. సీఎంను చిక్కుల్లో పడేసే సమాచారం బయటకు వచ్చింది. ముప్ఫై కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో పినరయ్ విజయన్ కు సంబంధం ఉందన్న ప్రతిపక్షాల మాటకు తగ్గట్లే.. ఈ కేసులో కీలకమైన స్వప్న సురేష్ కీలకమైన అంశాన్ని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
స్మగ్లింగ్ వ్యవహారంలో విజయన్ పాత్ర ఉందన్న విషయాన్ని స్వప్న దర్యాప్తు సంస్థలకు వెల్లడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో సీఎం నిండా మునిగినట్లుగా కస్టమ్స్ అధికారులు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. సీఎంతో పాటు మరో ముగ్గురు పేర్లను కూడా స్వప్న సురేశ్ విచారణలో వెల్లడించినట్లుగా సమాచారం. అంతేకాదు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లుగా వస్తున్న సమాచారం మరింత సంచలనంగా మారింది.
ఇదే నిజమైతే.. మొత్తంగా విజయన్ సర్కారు నిండా మునిగినట్లేనని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావటం ఖాయమన్న మాట పలు సర్వేలు చెబుతున్న వేళ.. బంగారు స్మగ్లింగ్ ఎపిసోడ్ తెర మీదకు రావటం ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు.
తాజాగా కేరళ అధికారులు రాష్ట్ర హైకోర్టుకు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ‘‘సీఎం విజయన్ కు అరబ్బీ భాషలో మాట్లాడలేరు. అందుకే కాన్సులేట్ జనరల్ కు.. సీఎం విజయన్ కు మధ్య అనుసంధానకర్తగా స్వప్న సురేశ్ వ్యవహరించారు. ఈ డీల్ లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు కోట్లాది రూపాయిలు కమిషన్ గా ముట్టినట్లు స్వప్న సురేశ్ వెల్లడించారు’’ అని పేర్కొన్నారు. కేరళ ఐటీశాఖలో పాటు.. సీఎం పేషీలో పెద్ద ఎత్తున చక్రం తిప్పిన స్వప్న సురేశ్ మీద గతంలో బోలెడన్ని వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆమె పేరు తెర మీదకు వచ్చింది. ఎన్నికల వేళ.. హైకోర్టుక కస్టమ్స్ శాఖ అధికారులు వెల్లడించిన సమాచారం పినరయి ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేలా చేసినట్లేనన్న మాట వినిపిస్తోంది.