ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి సీఎం మమతా బెనర్జీ దీటుగా జవాబిచ్చిన సంగతి తెలిసిందే. బెంగాల్ దంగల్ లో ఎలాగైనా గెలవాలని భావించిన బీజేపీకి దీదీ షాకిచ్చారు. భారీ మెజారిటీతో గెలుపొంది మోదీ అండ్ కోకు పరాభవం మిగిల్చారు. ఈ నేపథ్యంలోనే మరుగునపడిన నారదా ముగుపుల కేసును సీబీఐ తవ్వితీసిందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ కేసులో మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్ర, మాజీ పార్టీ నేత సోవన్ ఛటర్జీ లను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోపాటు, న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ను, పార్టీ నేత కళ్యాణ్ బెనర్జీని సీబీఐ ప్రతివాదులుగా పేర్కొనడం సంచలనం రేపింది.
కలకత్తా హైకోర్టులో విచారణ సందర్భంగా వీరి పేర్లను సీబీఐ తన పిటిషన్ లో చేర్చడం చర్చనీయాంశమైంది. విధి నిర్వహణలో ఉన్న తమను ముఖ్యమంత్రి అడ్డుకున్నారని, తమ ఆఫీసు బయట ఉద్రిక్త స్థితి ఏర్పడేలా ప్రేరేపించారని సీబీఐ పేర్కొంది. ఈ కేసు విచారణను ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సీబీఐ కోరింది. ఈ కేసులో అరెస్టు చేసిన నలుగురిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థించింది.
టీఎంసీ నేతలను సీబీఐ అరెస్టు చేసిన వెంటనే సీఎం మమత సహా భారీ సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలు సీబీఐ కార్యాలయం ముందు నిరసన తెలిపడం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. తమ నేతలను విడుదల చేయాలంటూ కార్యాలయంపైకి టీఎంసీ కార్యకర్తలు రాళ్ళ వర్షం కురిపించడం కలకలం రేపింది. ఆ నలుగురికి సీబీఐ స్పెషల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టులో సీీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, ఆ ఉత్తర్వులపై హైకోర్టు స్టే జారీ చేసింది. దీంతో మళ్ళీ ఈ నలుగురిని సీబీఐ అరెస్టు చేసి జైలుకు పంపింది.