సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ఈరోజు సాయంత్రం 2 గంటలపాటు కేజ్రీ నివాసంలోనే ఆయనను విచారణ జరిపిన అధికారులు ఆ వెంటనే అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్ అరెస్టు వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రేపు హౌస్ అవిన్యూ సిబిఐ కోర్టులో కేజ్రీను ఈడీ అధికారులు హాజరుపరచబోతున్నారు.
కేజ్రీ అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసం దగ్గరకు భారీ సంఖ్యలో ఆప్ నేతలు, కార్యకర్తలు చేరి ఆందోళన చేపట్టారు. ఈ కేసులో వైసీపీ మాజీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడి రాఘవ రెడ్డితోపాటు, మాజీ సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన సంగతి తెలిసిందే. మరోవైపు కేజ్రీ అరెస్ట్ కు కొద్ది నిమిషాల ముందు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నివాస్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అరెస్టు చేసినా కేజ్రీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోరని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కేజ్రీ గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. జైలు నుంచే ఢిల్లీని కేజ్రీ పరిపాలిస్తారు అని అన్నారు.
లోక్ సభ ఎన్నికల ముందు కేజ్రీని అరెస్టు చేయడం దేనికి నిదర్శనం అంటూ ఆప్ ఎంపీ రాఘవ ఛద్దా ప్రశ్నించారు. ఈ అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. కేజ్రీకి కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయనను టచ్ చేయడం ఎవరి వల్ల కాదని రాఘవ్ అన్నారు. కేజ్రీ శరీరాన్ని అరెస్ట్ చేయగలరని, కానీ, ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను అరెస్ట్ చేయలేరని చెప్పారు.
కేజ్రీ అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని విద్యాశాఖ మంత్రి ఆతిషి చెప్పారు. ఈ రాత్రికి ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరుతామన్నారు. కేజ్రీ అరెస్టు కాకుండా మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టులో ఆయన తరఫు లాయర్లు సవాల్ చేశారు. అత్యవసర ప్రాతిపదికన ఈ రోజు ఆ పిటిషన్ విచారణ జరపాలని కోరారు.