2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కావాలన్న ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే. బలమైన బీజేపీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఏకం కావాలని రాజకీయ విశ్లేషకులు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పై ఎన్నికల వ్యూహకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కొద్ది రోజుల క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోతోందని, సమైక్య ప్రతిపక్షం, వేగంగా ప్రతిస్పందించే పార్టీ యంత్రాంగం ఉంటేనే 2024 ఎన్నికల్లో బీజేపీని గట్టిగా ఎదుర్కోవచ్చని పీకే అన్నారు.
మొదట్లో పీకే మాటలను పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం…ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఓ మెట్టు దిగొచ్చింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పీకే శనివారం నాడు ఓ సారి భేటీ అయ్యి కీలక చర్చలు జరిపారు. తాజాగా మరోసారి సోనియాతో పీకే చర్చలు జరిపారు. గత మూడు రోజుల్లో సోనియాను పీకే కలవడం ఇది రెండో సారి కావడం విశేషం. 2024 సాధారణ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై వీరు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
మిషన్ 2024కు సంబంధించి సోనియా, రాహుల్ లకు పీకే విశ్లేషణాత్మకమైన ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకోవాలని పీకే సూచించారట. బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చెప్పారు. యూపీ, ఒడిశా, బీహార్ లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని సలహా ఇచ్చారట. ఇక, ఏపీలోనూ బలమైన వైసీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని పీకే సూచించారట. జగన్ తో టచ్ లో ఉండాలని సోనియాకు సూచించారట.
జగన్, కాంగ్రెస్ ల మధ్య పీకే మధ్యవర్తిత్వం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల, ఏపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేయడం, గుళ్లపై దాడుల విషయంలో బీజేపీ పెద్దల హస్తముందని, వివేకా కేసుతో పాటు పలు కేసులను బీజేపీ కావాలని బయటకు తెస్తోందని జగన్ భావిస్తున్నారని, కాబట్టి బీజేపీతో జగన్ కు ఎప్పుడైనా చెడొచ్చని పీకే చెప్పారట. అయితే, 2024 ఎన్నికలకు ముందు పరిస్థితులను బట్టి బీజేపీకి మద్దతు ఉపసంహరించుకోవాలా, కాంగ్రెస్ కు మద్దతివ్వాలా వద్దా అన్నవిషయంపై జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముందట.