ఏపీ సీఎం జగన్ నవ్యాంధ్ర ప్రదేశ్ లో నయా రాజకీయానికి తెర తీసారని టీడీపీ నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలోని కొందరు నేతల వ్యాపారాలను టార్గెట్ చేసిన సీఎం జగన్….ఆ రకంగా వారిని ఇబ్బందిపెట్టాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే, ఈ ఫార్ములాతో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను జగన్ టార్గెట్ చేశారని, ఈ క్రమంలోనే కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారి వైసీపీలో చేరారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్….ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను టార్గెట్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. రవి కుమార్ కు ప్రధాన ఆదాయవనరైన గ్రానైట్ వ్యాపారంపై జగన్ దెబ్బకొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్రానైట్ లీజులు రద్దు చేయడం, పర్మిట్లు క్యాన్సిల్ చేయడం, క్రయవిక్రయాల అనుమతులను నిలిపివేయడం…వంటి చర్యలతో రవికుమార్ వ్యాపారాలను జగన్ దెబ్బకొట్టారని ప్రకాశం జిల్లాలో టాక్ వస్తోంది.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రవికుమార్…ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఫిరాయింపులకు పాల్పడ్డ 23 మంది ఎమ్మెల్యేలలో రవి కుమార్ ఒకరు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రవి కుమారో ఓటమి పాలవడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. గత జనవరి నుంచి బల్లికురవ, గురిజేపల్లిలో ఉన్న రవికుమార్‌కు చెందిన 9 గ్రానైట్ లీజులు రద్దయ్యాయి. లీజుల రద్దుని హైకోర్టు తప్పుబట్టగా వేరే కారణంతో గ్రానైట్ నిక్షేపాల విక్రయ పర్మిట్లను నిలిపివేశారు. తాజాగా, జనవరి 26న గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో రవి కుమార్ కు చెందిన 3 గ్రానైట్ పరిశ్రమలు, మిగిలిన రెండు క్వారీలపైనా అధికారులు తనిఖీల పేరుతో దాడులు చేశారు. ఇటు గనులు, భూగర్భశాఖ అధికారులు, అటు ఆ శాఖ పరిధిలోని విజిలెన్స్ అధికారులు మూకుమ్మడిగా సోదాలు చేశారు. దీంతో, రెండు క్వారీలు, మూడు ఫ్యాక్టరీలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్వారీల్లోని నిక్షేపాల విక్రయ పర్మిట్లు ఆపేసినట్లే ఫ్యాక్టరీలకు సంబంధించిన క్రయవిక్రయాల పర్మిట్లను, రెండు క్వారీలు, మూడు ఫ్యాక్టరీల్లో క్రయవిక్రయాల అనుమతులను అధికారులు నిలిపివేశారు. దీంతో, రవికుమార్ కు నెలకు రూ. 2.5 కోట్ల విలువైన లావాదేవీలు నిలిచిపోయి ఆర్థికంగా నష్టం వాటిల్లింది. పార్టీ ఫిరాయించిన కారణంతోనే రవికుమార్ ను జగన్ నానా తిప్పలు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ మారిన పాపానికి గొట్టిపాటి పొట్టకొడుతున్నారని పలువురు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.