యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతగానో కలిసి వచ్చిన శ్రీకాకుళం జిల్లాలో కొంత అసంతృప్తి జ్వాల రేగుతోంది. ప్రజ్వరిల్లుతోంది. పాదయాత్రలో భాగంగా ఇక్కడికి చేరుకున్నాక ఆయన ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లారు. యాత్రను ఇచ్ఛాపురంలో ముగించారు. తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే జగన్ కూడా శ్రీకాకుళం వాసులు తనను దీవించాలని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో మీ వంతు సాయం ఇవ్వమని వేడుకున్నారు. తరువాత గెలిచాక ఆయన ఇప్పటిదాక ఒక్కటంటే ఒక్క పర్యటన కూడా జిల్లాలో చేపట్టలేదు. వాస్తవానికి రెడ్డి శాంతి కుమార్తె పెళ్లి వేడుకలకు పాతపట్నం వచ్చి వెళ్లారే కానీ జిల్లాలో అధికారిక పర్యటన అయితే చేపట్టలేదు. దీంతో ఇక్కడి నేతలు అసంతృప్తితో ఉన్నారు.
ప్రస్తుతం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నందున తమతో పాటే ఇదే కార్యక్రమంలో సీఎం పాల్గొంటే బాగుంటుందని కూడా ఎమ్మెల్యేలు అంటున్నారు. అదేవిధంగా మొన్నటి రివ్యూలో (గడపగడపకూ సంబంధించి జరిగిన వర్క్ షాప్ లో) సీఎం ను పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు జిల్లాల పర్యటనలు చేపట్టాలని విన్నవించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన త్వరలో జరగనుంది.
వాస్తవానికి సీఎం వస్తే జిల్లాలో ప్రతిష్టంభనలో ఉన్న కార్యక్రమాలపై ఆయనకు ఓ అవగాహన వస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కనుక ఆయన వచ్చాక సాగు నీటికి సంబంధించి పనులు ఏ మేరకు జరిగాయో అన్నది తెలిసి వస్తుంది. అదేవిధంగా క్షేత్ర స్థాయి ఇబ్బందులు, నిలిచిన రోడ్డు పనులు ఇవన్నీ కూడా ఆయన దృష్టికి నేరుగా వెళ్తాయి. అదేవిధంగా పార్టీలో నెలకొన్న అసంతృప్తత ల స్థాయి కూడా ఏంటన్నది తెలిసి వస్తుంది. అందుకే సీఎం పర్యటన అత్యంత ప్రాధాన్యంను సంతరించుకుని ఉంది.
రాజకీయంగా చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఏ కార్యక్రమం అయినా ఇక్కడి నుంచే చేపడుతున్నారు. నిన్నమొన్నటి వేళ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన రోడ్ షో మంచి సక్సెస్ సాధించింది. బాదుడే బాదుడే కార్యక్రమంకు విశేష స్పందన వచ్చింది.
ఇక్కడి పొందూరు మండలం, దల్లవలసలో మే నెలలో చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా పసుపు శ్రేణులు భారీ ఎత్తున తరలి రావడమే కాదు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నాయకులు, ప్రజలు తరలివచ్చారు.ఈ కార్యక్రమం సక్సెస్ తరువాత వైసీపీ పునరాలోచనలో పడింది. అటుపై బాబు యాత్రకు కౌంటర్ గా బీసీ బస్సు యాత్ర నిర్వహించి, సామాజిక న్యాయ భేరి పేరిట మంత్రులతో బహిరంగ సభలు నిర్వహించింది. కానీ అవి అనుకున్నంత సక్సెస్ అవలేదు. ఇప్పుడు తాజాగా సీఎం వస్తున్నందున ఏం జరుగుతుందో మారి. టీడీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో మరి !
ఇక వైసీపీలో కల్లోల వాతావరణం ఒకటి నెలకొని ఉంది. పైకి కనిపించకపోయినా అది అత్యంత అంతర్గత వ్యవహారంగా ఉంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తత ఉన్నా బయటకు మాట్లాడలేని స్థితిలో చాలా మంది నాయకులు మరియు కార్యకర్తలు ఉన్నారు.
కీలక బిల్లులు పెండింగ్-లో ఉండిపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. వీరంతా సొంత పార్టీ మనుషులే అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు సర్దిచెప్పలేకపోతున్నారు. అలానే జిల్లాలో చాలామంది కీలక నాయకులు హద్దు దాటి మాట్లాడుతున్నారు. వారిని కూడా నిలువరించాల్సిన ఆవశ్యకత ఉంది.
ముఖ్యంగా టెక్కలిలో ఉన్న అసంతృప్తతను సరిదిద్దాల్సి ఉంది. అదేవిధంగా మున్ముందు కూడా సీఎం ఇక్కడి పార్టీ మరియు ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారించాలి. కీలక సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కి కాస్తయినా దృష్టి సారిస్తే మేలు. వంశధార ఫేజ్ 2 కు నిధులు ఆశించిన మేర ఇస్తే ఇంకా మేలు.
పనుల నిర్వహణ సజావుగా సాగి ప్రాజెక్టు అనుకున్న సమయానికి అందుబాటులోకి రావడం ఖాయం. అదేవిధంగా తోటపల్లి, నారాయణపురం ప్రాజెక్టుల నిర్వహణకు గడిచిన రెండేళ్లుగా నిధుల్లేవు. ఆ మధ్య మంత్రి బొత్స చొరవ కారణంగా తోటపల్లి ప్రాజెక్టు కాలువల నిర్వహణకు కాస్తో కూస్తో నిధులు ఇచ్చినా అవి ఏ మేరుకు చాలవు. వీటిపై కూడా దృష్టి సారిస్తే ఇంకా మేలు.
ఇంకా ఉద్దానం వాకిట కట్టాలనుకున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి పనులను వేగవంతం చేసేందుకు కూడా సంబంధిత అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేసి వెళ్తే మేలు.