సాధారణంగా ఒక కేసు లేదా పిటిషన్ పై కోర్టు విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో దాని గురించి మాట్లాడకూడదన్న విషయం సామాన్యులకు కూడా తెలుసు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. రాష్ట్రానికి రాజధాని వంటి సున్నితమైన, కీలకమైన అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో అధికార పార్టీ నేతలు ఆ వ్యవహారంపై తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తుంటారు.
అధికార పార్టీ నేతలను పక్కన పెడితే సాక్షాత్తు ఆ పార్టీ అధినేత కూడా కోర్టులంటే లెక్కలేనితనం అన్న రీతిలో కామెంట్ చేస్తుంటారు. ఏపీ రాజధాని విశాఖ అంటూ ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని అంశం పెండింగ్లో ఉండగానే విశాఖ ఏపీ రాజధాని అని జగన్ ఎలా అంటారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ రాశారు.
న్యాయస్థానాధికార చట్టం 1971లోని సెక్షన్ 2Cను జగన్ ఉల్లంఘించినట్టేనని తన లేఖలో ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు అధికారాన్ని జగన్ ఆ వ్యాఖ్యలతో ఉల్లంఖించారని అన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. మరి, ఈ లేఖపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.