యావత్ దేశం కరోనా సెకండ్ వేవ్ లో తల్లడిల్లుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే.. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు లేవు. అలా అని.. సాధారణ పరిస్థితులు కూడా లేవు.
ఏ రోజుకు ఆ రోజు అన్నట్లుగా బతుకు బండి సాగుతోంది. కరోనా వచ్చి.. ఏ మాత్రం ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా తిప్పలు మొదలైనట్లే. ఆసుపత్రి బెడ్ మొదలు.. అన్ని విషయాల్లోనూ ఇబ్బందులు తప్పటం లేదు.
అందుకే.. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరిగా మారింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలని మహమ్మారి విషయంలో ఏం ఉన్నా లేకున్నా అప్రమత్తత చాలా అవసరం.
కానీ.. కోవిడ్ ప్రోటోకాల్ విషయంలో అతి ముఖ్యమైన మాస్కు ధరించే విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఆయన ముఖానికి మాస్కు పెట్టుకున్నారని చెప్పక తప్పదు.
సరే.. ఆయన ముఖానికి మాస్కు పెట్టుకోకున్నా.. మిగిలిన వారు మాస్కు పెట్టుకుంటే ఆయనకు ముప్పు చాలావరకు తగ్గినట్లే. అదేం చిత్రమో కానీ.. సీఎం జగన్ ను కలిసే సమయంలో చాలామంది ముఖానికి మాస్కు లేకుండా ఉండటం.. ఆయనతో ఫోటో తీసుకునే వేళ.. మాస్కును తీసేస్తున్న వైనం షాకింగ్ గా మారుతోంది.
ఎక్కడ దాకానో ఎందుకు.. తాజాగా జగనన్న వసతి దీవెన పథకం నిధుల చెక్కుల్ని అందించే కార్యక్రమాన్ని తాజాగా షురూ చేశారు.
ఈ క్రమంలో లబ్థిదారులకు వారి ఖాతాల్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిధుల చెక్కును ప్రదర్శిస్తూ ఫోటో దిగారు. జగన్ తో పాటు అత్యంత సన్నిహితంగా మంత్రులు శ్రీనివాస గోపాలక్రిష్ణ.. శంకరనారాయణ.. ఆదిమూలపు సురేష్ తో పాటు.. పలువురు ఉన్నారు.
ఒకే ఫ్రేమ్ లో ఏకంగా 13 మంది అది కూడా జగన్ కు చాలా సన్నిహితంగా ఉండి ఫోటో దిగిన వైనం చూస్తే.. షాక్ అవ్వాల్సిందే.
కోవిడ్ సెకండ్ వేవ్ లో ఏ మాత్రం చేయకూడని సాహసాన్ని జగన్ అండ్ కో చేసినట్లుగా చెప్పక తప్పదు. ఈ పదమూడు మందిలో ఇద్దరు తప్పించి.. మిగిలిన వారెవరికి మాస్కులు లేకపోవటం గమనార్హం.
కరోనా కత్తి కొసన నడిచే ఈ తీరును అందరూ తప్పుపడుతున్నారు. సీఎం జగన్ ముఖానికి మాస్కు పెట్టుకోలేదు సరే.. ఆయన్ను అభిమానించే వారు.. ఆయనకు ఏమాత్రం నష్టం జరగకూడదనిపిస్తే.. మిగిలిన వారంతా మస్ట్ గా మాస్కు పెట్టుకోవాలి.
అలా చేయకుండా వ్యవహరిస్తున్న తీరు జగన్ తో పాటు మిగిలిన వారిని కరోనా ముప్పులో పడేస్తుందన్న విషయాన్ని మరవకూడదు.
జగన్ వాదన:
నేను మాస్క్ వాడను
మీరు మాస్క్ వాడకపోతే ఫైన్ వేస్తాను