మామూలుగా కోర్టులు, ఉన్నత స్థాయి న్యాయమూర్తులతో పెట్టుకోవడానికి పెద్ద పెద్ద నాయకులు, బలమైన ప్రభుత్వాలు కూడా భయపడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ నిర్ణయాలపై హైకోర్టులో వరుసగా మొట్టికాయలు తగులుతుండటం.. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు వివిధ తీర్పులపై విమర్శలు చేసి కోర్టు ధిక్కరణ కేసులు కూడా ఎదుర్కోవడం తెలిసిన సంగతే. అయినా సరే.. వైకాపా అధినేత, నాయకులు ఏమీ తగ్గట్లేదు. తెలుగుదేశం పార్టీ కోర్టులను మేనేజ్ చేస్తుందనే ఆరోపణలను బలంగా వినిపించడమే కాదు.. న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.
ఇప్పుడు సుప్రీం కోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణపై సంచలన ఆరోపణలతో జగన్ సర్కారు ప్రత్యక్ష పోరుకు సిద్ధం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోద్బెకు జగన్ సర్కారు ఫిర్యాదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎన్వీ రమణ సన్నిహితుడని పేర్కొంటూ ఆయన అవినీతికి సంబంధించి జస్టిస్ చలమేశ్వర్ చేసిన ఆరోపణలు, సమర్పించిన సాక్ష్యాల గురించి ఇందులో ప్రస్తావించారు.
ఏపీ హైకోర్టును రమణ ప్రభావితం చేయడం ద్వారా చంద్రబాబుపై ఉన్న కేసులను నిష్పాక్షికంగా విచారణ జరగనివ్వకుండా చేస్తున్నారని ఈ ఫిర్యాదులో ఆరోపణలు గుప్పించడం గమనార్హం. స్వయంగా జగన్ పేరుతోనే ఈ ఫిర్యాదు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంచలనం రేపుతోంది.