విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రా ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్మిక సంఘాలు, ప్రజలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక, తాను కూడా కేంద్రాన్ని ప్రశ్నించాను అనిపించుకోవడానికి ప్రధాని మోడీకి సీఎం జగన్ ప్రేమతో ఓ లేఖ రాశారని విమర్శలు వస్తున్నసంగతి తెలిసిందే.
కానీ, అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సూత్రధారి ఎంపీ విజయసాయిరెడ్డి అని, జగన్ పాత్రధారి అని, విశాఖ ఉక్కును, ఆంధ్రుల హక్కును బేరం పెట్టింది ఏపీ ముఖ్యమంత్రే అని విమర్శలు వస్తున్నాయి. అయిపోయిన పెళ్లికి బాజాల టైపులో, 2019 అక్టోబర్ లోనే పోక్సో కంపెనీతో విశాఖ ఉక్కు కంపెనీనీ జగన్ బేరం పెట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా ఈ పుకార్లకు, ప్రచారానికి ఊతమిచ్చేలా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన విషయాలను వెల్లడించారు.
పోస్కో, విశాఖ ప్లాంట్ కు మధ్య 2019 అక్టోబర్ లోనే ఒప్పందం కుదిరిందరని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. ఒప్పందం కుదిరిన తర్వాతే సీఎం జగన్ ను పోస్కో ప్రతినిధులు కలిశారని సభాముఖంగా తెలిపారు. విశాఖ ప్లాంట్ ను పోస్కో బృందం 3 సార్లు సందర్శించిందని, భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. కొత్త ప్లాంట్ లో పోస్కో వాటా 50 శాతం అని, ఎన్ఐఎన్ఎల్ వాటా ఎంతో నిర్ణయించాల్సి ఉందన్నారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా ధర్మేంద్ర ప్రధాన్ ఈ వివరాలను వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేయనుందని, ఈ ప్రకారం POSCO, RINL మధ్య భూముల అప్పగింత కు నాన్ బైండింగ్ ఎంవోయూ కుదిరిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇప్పటికే పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్ గ్రూప్ (JWG)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాజాగా కేంద్రమంత్రిని విజయసాయిరెడ్డి ప్రశ్న అడగడం కూడా ఉద్దేశ్యపూర్వకమేనని, ఆల్రెడీ విజయసాయిరెడ్డికి ఈ డీల్ గురించి తెలుసని, దానిని కేంద్ర మంత్రి నోటితో చెప్పించి తమ ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూడాలన్న ప్లాన్ లో విజయసాయిరెడ్డి ఉన్నారని విమర్శలు వస్తున్నాయి.
విశాఖ ఉక్కును బేరం పెట్టింది జగనే అని జరుగుతున్న ప్రచారం నిజమేనని, జగన్ గుట్టును ఆ కేంద్ర మంత్రి రట్టు చేశారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ తాను పోక్సో కంపెనీకి బేరం పెట్టిన ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దంటూ జగన్ లేఖ రాసి డ్రామాలాడుతున్నారని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రకంగా జగన్ రెండు నాల్కల ధోరణితో ప్రజలను మోసం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలా, ఎల్లకాలం ప్రజలను మోసం చేసి మభ్యపెట్టలేరని, వచ్చే ఎన్నికల్లో జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.