సత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కత్తులతో బెదిరించి అత్తా కోడలిపై అత్యాచారం చేసిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సత్యసాయి జిల్లా ఎస్పీతో చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. ఈ ఘటనపై దర్యాప్తు వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్, సివిల్ సప్లై, వ్యవసాయ మార్కెటింగ్ శాఖలపై సంబంధిత శాఖల అధికారులతో చంద్రబాబు తన నివాసంలో రివ్యూ నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ప్రజలపై ధరల భారం లేకుండా చూడాలని సూచించారు. డిమాండ్ సప్లై అంతరాన్ని తగ్గించి తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటివరకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చేపట్టిన చర్యల గురించి చంద్రబాబుకు అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ సీఎస్ నేరపు కుమార్ ప్రసాద్ వర్చువల్ గా హాజరయ్యారు. రైతు బజార్లలో కౌంటర్ ద్వారా మార్కెట్ ధరల కంటే పది నుంచి పదిహేను రూపాయలు తక్కువకే కూరగాయలు అమ్ముతున్నట్లు వివరించారు. వ్యాపారులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరల విషయంలో ప్రజలు ఉపశమనం పొందితేనే వారు హర్షిస్తారని ,అందుకోసం అవసరమైన ప్రణాళికలను అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.