2024 ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న చంద్రబాబు ఒక్కొక్కటిగా పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు లబ్ధిదారు అయిన మహిళకు సిలెండర్ అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఆ ఇంట్లో టీ పెట్టి కుటుంబ సభ్యులకు కూడా అందించారు. ఇంకో ఒంటరి మహిళలకు పెన్షన్ అందజేసిన చంద్రబాబు తనకు ఇల్లు లేదని ఆ మహిళ చెప్పడంతో వెంటనే ఇల్లు మంజూరు చేస్తూ రేపటి నుంచి పనులు ప్రారంభించాలని కలెక్టర్ తో పాటు ఇతర అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు…వైసీపీ పాలనపై, జగన్ పై సంచలన విమర్శలు చేశారు.
జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని కలిసికట్టుగా పోరాడి కాపాడుకున్నామని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల్లో నరకాసురుని ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అత్యధిక సీట్లు సాధించి రికార్డు విజయం ప్రజలు అందించారని గుర్తు చేసుకున్నారు. జగన్ పాలనలోని దౌర్భాగ్యకరమైన రోజులు పోయాయని అన్నారు. అయితే, గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కానీ, కక్షా రాజకీయాలకు వెళుతూ సమయం వృధా చేసుకోబోనని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు.
దీపం-1 తానే ఇచ్చానని, ఇప్పుడు దీపం 2 పథకం కూడా తానే ప్రారంభించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉచిత గ్యాస్ బుక్ చేసుకోవడానికి ముందుగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని, త్వరలోనే డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు. ఇక, 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చని, ఎవరైనా పెన్షన్ ఆపితే నిలదీయాలని, పెన్షన్ ప్రజల హక్కు అని చంద్రబాబు అన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు.