విజయవాడ పున్నమి ఘాట్ వద్ద విజయవాడ టు శ్రీశైలం ‘సీ ప్లేన్’ ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. సీ ప్లేన్ ప్రయాణం వినూత్నమైన అవకాశం అని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీ గుజరాత్ లో సీ ప్లేన్ ప్రారంభించాలని చూసినా కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదని అన్నారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారని, మనకు మంచి అవకాశమని అన్నారు. మామూలు విమానాలే కాకుండా సీ ప్లేన్ ల ద్వారా ప్రజా రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు.
సీ ప్లేన్ ల కోసం ఎయిర్ పోర్టులు అవసరం లేదని, అతి తక్కువ ఖర్చుతోనే బ్యాక్ వాటర్, రిజర్వాయర్ల దగ్గర జెట్టీలు ఏర్పాటు చేయొచ్చని చెప్పారు. రాబోయే 4 సంవత్సరాల్లో 10-15 సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించాలని రామ్మోహన్ నాయుడును చంద్రబాబు కోరారు. ఏపీలోనే రెండు సీ ప్లేన్ లను వాడుకుంటామని చెప్పారు. పీపీపీ విధానంలో ముందుకు పోవాలని సూచించారు.
రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, ఉపాధి ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేసుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి సంపద క్రియేట్ చేయాలని అన్నారు. అలా కాకుండా అప్పు చేసి అరకొర సంక్షేమం అధించడం సరికాదని అన్నారు. పేదరిక నిర్మూలన, జీరో పోవర్టీ, పేదలను పైకి తెచ్చే మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు.
ఐదేళ్లుగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని, ఒక్కొక్కటిగా వ్యవస్థలను బాగు చేసుకుంటూ వస్తున్నామని చంద్రబాబు చెప్పారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 93 శాతం స్ట్రైక్ రేట్ తో ఎవరిని పెడితే వారిని గెలిపించారని అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకువస్తున్నామని, కేంద్రం సహకారంతో ముందుకు పోతున్నామని చెప్పారు. ఏపీని నంబర్ వన్ గా నిలబెట్టే వరకు నిద్రపోనని అన్నారు.
పున్నమి ఘాట్ నుండి సీ ప్లేన్లో చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు, ఇతర మంత్రులు ప్రయాణించి శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని చంద్రబాబు సందర్శించారు. శివుడి ఆశీస్సులు తీసుకున్న తర్వాత తిరిగి సీ ప్లేన్ లో విజయవాడ పున్నమిఘాట్కు చంద్రబాబు చేరుకున్నారు.