సార్వత్రిక ఎన్నికల వేళ సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు .. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఒక్కొక్కటిగా తాను ఇచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో నలబై రోజుల తర్వాత రానున్న దీపావళి పండక్కి కానుకను తాజాగా ప్రకటించేశారు. సూపర్ సిక్స్ హామీల్లో మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఉచిత గ్యాస్ బండకు సంబంధించిన ప్రకటన చేశారు. దీపావళి నుంచి ఏపీ ప్రజలకు ఉచిత గ్యాస్ బండ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
మొత్తంగా పండక్కి ప్రభుత్వం తరఫున ఇచ్చే కానుకను ముందుస్తుగా ప్రకటించటం ద్వారా ఏపీ ప్రజల్ని సర్ ప్రైజ్ చేశారనే చెప్పాలి. ఇక.. వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామన్న ఆయన.. ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ ఇవ్వని రీతిలో పరిహారాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.
వరదల్లో దెబ్బ తిన్న వారికి గడిచిన నలభై ఐదేళ్లలో ఎప్పుడూ ఇవ్వనంత పరిహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. వరదల వేళ ప్రజలు పడిన కష్టాల్ని చూసి చలించిపోయినట్లు చెప్పిన చంద్రబాబు.. ‘‘పది రోజులు అక్కడే ఉండి.. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత వచ్చేశా’’ అని ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సర్వ శక్తులు ఒడ్డినట్లుగా చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల వేళ తామిచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తిరుమలకు సంబంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూ నాణ్యత పడిపోయిందన్న చంద్రబాబు.. ‘‘జంతువుల నెయ్యితో లడ్డూ ప్రసాదంలో వాడేవారు. ఇప్పుడు మేం స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నాం’’ అని పేర్కొన్నారు. నెల మొదటి రోజునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇస్తున్నట్లుగాపేర్కొన్నారు. కష్టమైనప్పటికి కమిట్ మెంట్ తో పని చేస్తున్నామన్నారు.
అన్నాక్యాంటీన్ ను రద్దు చేసి జగన్ దుర్మార్గమైన పని చేశారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాలంటీర్ల గడువు ముగిసిందని గర్తు చేసిన చంద్రబాబు.. ‘‘జగన్ సీఎంగా ఉన్నప్పటి సమయంలోనే వాలటీర్ల వ్యవస్థ గడువు తీరిపోయింది. అయినప్పటికి వారిని రెన్యువల్ చేయలేదు. వైసీపీలో తప్పులు చేసిన వారిని వదిలి పెట్టను’’ అంటూ స్పష్టం చేశారు. అక్టోబరు మొదటి వారంలో కొత్త మద్యం పాలసీని తీసుకొస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. రూ.99కే పేదవాడికి నాణ్యమైన మద్యాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.