వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో కీలక సాక్షి, ఆయన ఇంటి వాచ్మెన్ రంగన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మృతి సాధారణం కాదని.. పోలీసులు కొట్టి చంపారని ఆయన భార్య ఆరోపించారు. అంతేకాదు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజానిజాలు తెలుసుకుని కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. తాజాగా ఈ విషయం ఏపీ మంత్రివర్గంలోనూ చర్చకు వచ్చింది. ప్రధానంగా ఈ అంశంపై సీఎం చంద్రబాబు, మంత్రులు గంటకుపైగా వివిధ కోణాల్లో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రంగన్న మృతి అనుమానాస్పదమేనని చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనివెనుక వైసీపీ కుట్రలు ఉన్నాయని ఆయన తెలిపా రు. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారన్న ఆయన.. గతంలో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి కూడా బెదిరింపులు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కేసు వివరాలను డీజీపీని స్వయంగా పిలిపించి ఆయన మంత్రివర్గానికి వినిపించారు. రంగన్న మృతి వెనుక అనుమానాలు ఉన్నాయన్నది వాస్తవమేనని డీజీపీ కూడా అంగీకరించారు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలించారని.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇక, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2004-05 మధ్య జరిగిన పరిటాల రవి దారుణ హత్య కేసును ఉదహరిస్తూ.. ఆ కేసులో నూ అనేక మంది సాక్షులు చనిపోయారని.. అప్పట్లోనూ ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయన్నారు. రంగన్న మృతి వెనుక కూడా బలమైన కారణాలు ఉండి ఉంటాయని.. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయారని వైసీపీ ప్రచారం చేస్తోందని, అంటే.. వారు చేసిన నేరాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సందేహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్ మామూలోడు కాదని.. దేనికైనా తెగిస్తాడని.. తన తల్లిని, చెల్లిని కూడా కోర్టుకు లాగిన వ్యక్తి అని చంద్రబాబు అన్నారు. అతని కుట్రల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని తాను మొదటి నుంచి చెబుతున్నానన్నారు.
రాజకీయాల ముసుగులో నేరస్తులు ఇష్టారాజ్యంగా చెలరేగుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకులను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు చెప్పారు. వివేకా హత్య కేసులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్.. సీబీఐ దర్యాప్తు కోరారని.. అధికారంలోకి వచ్చాక సీబీఐని వద్దన్నారని గుర్తు చేశారు. ముందు గుండెపోటు, తర్వాత గొడ్డలిపోటుగా మారిందన్నారు. ఈ కేసులో తండ్రిని కోల్పోయి బాధితురాలిగా ఉన్న సొంత చెల్లిని(సునీత) నిందితురాలిగా చూపించే కుట్ర చేశారని అన్నారు. ఇప్పుడు రంగన్న మృతి కేసును కూడా ఇలానే చేసే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో నాయకులు అప్రమత్తంగా ఉండి.. ఎలాంటి విమర్శలనైనా తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు.