హైదరాబాదులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి భేటీ అయిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా పరిష్కారం కాని విభజనానంతర సమస్యలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆ భేటీపై చంద్రబాబు స్పందించారు. తన మంత్రివర్గ సహచరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశయ్యానని, విభజన సమస్యలపై చర్చలు జరిపానని చంద్రబాబు అన్నారు. పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై చర్చించామని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందని చంద్రబాబు చెప్పారు.
మరోవైపు, ఈ సమావేశంపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ కూడా స్పందించారు. ఇది తెలుగుజాతి హర్షించే రోజని, తెలంగాణను పురోగామి పథంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రులు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఈ సమావేశానికి హాజరై రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేసే నిర్ణయాల దిశగా కీలక ముందడుగు వేసిన శుభదినం ఇదని అన్నారు.
విభజన అంశాల పరిష్కారం కోసం చొరవ తీసుకుని రేవంత్ కు చంద్రబాబు ఓ లేఖ పంపడం, రేవంత్ రెడ్డి గారు ఆ లేఖపై సానుకూలంగా స్పందించడంతోనే ఈ భేటీ జరిగిందన్నారు. నిధులు, విధులు, కేటాయింపులు… ప్రాతిపదికన తెలంగాణ ఏర్పడిందని, ఏపీ అభివృద్ధి, సెంటిమెంట్ ను పరిగణనలోకి తీసుకుని… ఎవరి మనోభావాలు దెబ్బతినని రీతిలో, అందరి భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని, ఉభయ రాష్ట్రాల ఆకాంక్షలను నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో నేటి చర్చల సరళి సాగిదంని అన్నారు.
ఆ నమ్మకంతోనే అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ వేశామని చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేలా తెలంగాణ సర్కార్ వేసిన ప్రణాళికతో తాము కూడా సమన్వయం చేసుకుని ముందుకు పోతామని, అందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులతో ఒక సబ్ కమిటీ వేసుకున్నామని చెప్పారు.
విభజన అంశాలపై మరోసారి సమీక్షించిన తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తామని అనగాని సత్యప్రసాద్ చెప్పారు.