సీఎం చంద్రబాబు తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘట నలో ఆరుగురు మృతి చెందడం, వీరిలో ఐదుగురు మహిళలే ఉండడం.. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చిన ట్టు కనిపించడంతో సీఎం చంద్రబాబు సీరియస్‌గానే స్పందించారు. వాస్తవానికి గురువారం షెడ్యూల్ వేరే ఉన్నా.. దానినిసైతం పక్కన పెట్టి విశాఖలో ప్రధాని మోడీ పర్యటన అనంతరం.. తిరుపతి ఘటన పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటలకే అమరావతి నుంచి తిరుపతికి బయలు దేరి వచ్చారు. తొక్కిసలాట ఘటనపై ఆరా తీశారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సాధారణ భక్తులకు టోకెన్లు పంపిణీ చేసే కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో కలెక్టర్, టీటీడీ ఈవో, జేఈవో, డిప్యూటీ కలెక్టర్, ఎస్పీ సహా అన్ని స్థాయిల్లోని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నిలదీశారు. అయితే, చం ద్రబాబు అడిగిన ప్రశ్నలకు అధికార యంత్రాంగం నీళ్ళు నమిలింది.
గతంలో లాగే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామల రావు సీఎం చంద్రబాబుకు సమాధానం ఇచ్చారు. అయితే.. దీనిపై సీఎం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. “ఎవరో చేశాడని నువ్వు అలానే చేస్తావా? నీకంటూ కొత్త ఆలోచనలు లేవా? “ అంటూ ఈవోను ప్రశ్నించిన చంద్రబాబు.. టెక్నాలజీని ఎందుకు వాడుకోలేదని నిలదీశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక కోసం.. మంత్రులతో కూడిన కమిటీని వేయనున్నట్టు చంద్రబాబు తెలిపారు.
ఇదేసమయంలో ఆయన ఇంత సీరియస్‌గా స్పందించడాన్ని గమనించిన మంత్రులు, ఇతర అధికారులు కూడా టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేయడం ఖాయమని అంటున్నారు. కేసు తీవ్రత ఎక్కువగా ఉండడం.. అధికారుల మధ్య నిర్లక్ష్య ధోరణి కనిపించడం.. భక్తుల విషయంలో పక్కా సమాచారం లేకుండా.. ఈవో వ్యవహరించడంతో సీఎం చంద్రబాబు ఆయనను బదిలీ చేయడం ఖాయమని అంటున్నారు. అయితే.. మంత్రుల కమిటీ నివేదిక వచ్చే వరకు వెయిట్ చేయొచ్చని తెలుస్తోంది.