టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఇక, జనం బాట పట్టనున్నారా? ప్రజల మధ్యకు వెళ్లేందుకు ఆయన మానసికంగా.. భౌతికంగా కూడా సిద్ధమయ్యారా? అంటే.. ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అమలు చేస్తున్న పథకాలు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అయితే.. ప్రజలు సూపర్ సిక్స్ పథకాలపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. దీంతో వాటిని అమలు చేయాల్సి వస్తోంది.
కానీ, అవన్నీ ఆర్థికంగా సర్కారుకు భారంగా మారడంతో వాటి అమలు చాలా వరకు ఆలస్యం అవుతోంది. దీంతో ఇప్పుడు ప్రజల మైండ్ సెట్ మారుతోంది. దీనిని అత్యంత వేగంగా పసిగట్టిన చంద్రబాబు.. కూట మి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలక ముందే జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తాజా గా జరిగిన మీడియా సమావేశంలో ఆయన నర్మగర్భంగా ప్రస్తావించారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నార ని.. రెండు మాసాల కిందట చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ ప్రస్తావనను పక్కన పెట్టారు.
అంతేకాదు.. ప్రజలకు ప్రభుత్వ పరిస్థితిని వివరించాల్సిన అవసరం ఉందంటూ.. చంద్రబాబు చెప్పడం వెనుక.. సూపర్ సిక్స్ వ్యవహారంలో ప్రజల ఆలోచనా విధానాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యం లో ప్రజల మనసులు మారకముందే.. చంద్రబాబు వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలసింది. మీడియా సమావేశానికి ముందు నిర్వహించిన అధికారులతో సమీక్షలో నూ చంద్రబాబు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజలకు అన్నీ వివరించాలని.. గత ప్రభుత్వం వివరించడంలో తప్పులు చేసిందని ఆయన వ్యాఖ్యానిం చారు. అంటే.. ప్రభుత్వ పరిస్థితి, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ప్రజలకు వివరించేందుకు రెడీ అయ్యారన్న సంకేతాలు ఇచ్చారు. తద్వారా.. వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో లేదా.. ఆ నెలాఖరులో అయినా..చంద్రబాబు ప్రజాబాట పట్టేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.