రాజధాని అమరావతి ని విధ్వంసం చేసేందుకు మాస్టర్ ప్లాన్‌ను జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. ఇప్పుడు దానిని గాడినపెట్టి సరిదిద్దేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాయువేగంతో కదులుతోంది. ఇందులో భాగంగా అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం గ్రామాల పరిధిలో ఉన్న 1,575 ఎకరాలను నోటిఫై చేశారు. ఈ మేరకు సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం కమిషనర్ కాటమనేని భాస్కర్ బహిరంగ ప్రకటన జారీ చేశారు.
అమరావతిలో ప్రభుత్వ భవనాల కోసం గత టీడీపీ ప్రభుత్వం 1,375 ఎకరాలను కేటాయించగా.. తాజాగా మరో 200 ఎకరాలను పెంచి నోటిఫై చేశారు. ఈ ప్రాంతంలో చంద్రబాబు ఇంటెరిం గవర్నమెంట్ కాంప్లెక్స్(ఐజీసీ), అసెంబ్లీ నిర్మాణాలను చేపట్టింది. వీటితో పాటు రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసంతో పాటు పలు కీలకమైన భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించే సచివాలయం కూడా ఉంది. మొత్తం 5 టవర్లను నిర్మించడానికి గతంలో ప్రణాళికలు రూపొందించారు. వీటిలో రెండు టవర్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పనులన్నీ అటకెక్కించారు. అమరావతి విధ్వంసం మొదలుపెట్టారు.
ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతాన్నే టార్గెట్ చేశారు. ప్రభుత్వ పరిపాలనా భవన నిర్మాణాలను ఆపేశారు. అప్పటి వరకు 25 శాతం కూడా పురోగతి లేని పనులను నిలుపుదల చేశారు. ఈ ఆదేశాల వెనుక శాశ్వత ప్రాతిపదికన నిర్మించే భవనాల పనులను నిలిపివేయాలన్నదే జగన్ కుట్ర. శాశ్వత సచివాలయానికి సంబంధించి 5 టవర్లను నిర్మించకుండా తొక్కిపెట్టేందుకే 25 శాతం పురోగతి లేదన్న సాకుతో.. అమరావతిపై జగన్ వేటు వేశారు. మొత్తం ఐదు జీఏడీ టవర్లను 40 నుంచి 45 అంతస్థుల మేర నిర్మించాల్సి ఉంది. వాటిని కూడా జగన్ తన నిర్ణయాలతో సమాధి చేశారు. టీడీపీ హయాంలో రెండు జీఏడీ టవర్లను రాఫ్ట్ ఫౌండేషన్ విధానంలో చేపట్టారు. వాటిని కూడా జగన్ నిలిపివేయించారు. గత టీడీపీ హయాంలో దాదాపు 70 నుంచి 80 శాతం పనులు పూర్తి చేసుకున్న అఖిల భారత సర్వీసు అధికారుల భవనాలతో పాటు, ఎన్జీవో భవనాల పనులను కూడా ఆపేశారు.
మాస్టర్ ప్లాన్‌కు తూట్లు
అమరావతిపై కత్తికట్టిన జగన్.. మూడు రాజధానుల ఆటతో ఆగలేదు. అమరావతి అభివృద్ధికి కీలకమైన మాస్టర్ ప్లాన్ కే తూట్లు పొడిచారు. దీనిని ఇష్టానుసారంగా మార్చేశారు. మాస్టర్ ప్లాన్‌ను మార్చాలంటే ముందుగా ఆయా గ్రామ పంచాయతీల తీర్మానాలను ప్రాతిపదికగా తీసుకోవాలి. స్థానికంగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదన్న సాకుతో ఆయా గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులపై ఒత్తిడి తెచ్చి.. ప్రజలను కూడా బెదిరించి మాస్టర్ ప్లాన్ సవరణలకు బలవంతంగా ఆమోదముద్ర వేయించారు. గ్రామ సభలు నిర్వహించి ప్రజాభ్రిపాయం తీసుకోవలసింది పోయి.. అసలవి జరపకుండానే ప్రత్యేకాధికారులతో సవరణలకు అనుకూలంగా తీర్మానాలు రాయించారు.
జోనింగ్ రెగ్యులేషన్స్ మార్చాలన్న కుట్రతోనే జగన్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సవరణకు పూనుకున్నారు. భూములు అమ్ముకునేందుకు, టౌన్‌షిప్పులకు ఇచ్చుకునేందుకు వీలుగా రియల్ ఎస్టేట్ ప్రణాళికలతో ప్లాన్‌లో సవరణలు చేశారు. ఆర్-5 జోన్ తీసుకొచ్చారు. పేదల ఆవాసాల కోసం విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, పెదకాకాని, దుగ్గిరాల తదితర ప్రాంతాలకు చెందిన 45 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో ఆర్-5 జోన్లో సెంటు పట్టాలు ఇచ్చారు. ఇవి కాకుండా అదనపు కోటా కింద మరో 5 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు భూ సేకరణ నోటిఫికేషన్లు కూడా వెలువరించారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేశ్ గెలవకూడదన్న ఉద్దేశంతో ఇన్ని అవకతవకలకు పాల్పడ్డారు. అయితే కోర్టు జోక్యంతో అంతా తలకిందులైంది. ఎన్నికల్లో జనం మాడు పగలగొట్టడంతో జగన్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు.
అమరావతికి కేంద్ర సంస్థల క్యూ..!
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు ఒక్కొక్కటిగా కాలుమోపుతుండగా తాజాగా కేంద్ర సంస్థలు కూడా అమరావతి బాట పడుతున్నాయి. దాదాపు 45 కేంద్ర సంస్థలు అమరావతిలో తమకు కేటాయించిన భూములలో కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం విశేషం. కొన్ని సంస్థలు ఇప్పటికే సీఆర్డీఏ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. తమకు కేటాయించిన భూములను చదును చేసే అంశాలపై చర్చిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అమరావతి రాజధానిలో మొత్తం 132 సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి. వీటిలో కేంద్ర సంస్థలు 45 వరకూ ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక కార్యాలయాల ఏర్పాటు, స్థలాల స్వాధీనం, అగ్రిమెంట్ల విషయంలో ఆయా సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేశారు.
దీంతో గత ఐదేళ్లూ ఇటు వైపే చూడలేదు. కొన్ని సంస్థల భూకేటాయింపులను రద్దు చేస్తామని కూడా వైసీపీ ప్రభుత్వం బెదిరించింది. ఆయా సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పడంతో వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో సంస్థలకు సహకరించకుండా ఇబ్బందులు పెట్టింది. టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో.. సుమారు 40 సంస్థలు మళ్లీ ముందుకొచ్చాయి. ప్రభుత్వ స్థాయిలో కూడా పురపాలక అధికారులు మిగిలిన సంస్థలకు ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో కూడా కేంద్ర సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఆయా సంస్థలకు యుద్ధ ప్రాతిపదికన అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు అందాయి. దరిమిలా అన్ని కేంద్ర సంస్థల నుంచి సానుకూలత, సుముఖత వ్యక్తమైంది. దాంతో వాటికి కేటాయంచిన స్థలాల్లో సీఆర్డీఏ యుద్ధప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ చేపట్టింది.
అమరావతిలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటన
రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని కట్టడానికి రూ.15 వేల కోట్ల సాయం అందిస్తామని కేంద్రప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు ప్రస్తుతం అమరావతిలో పర్యటిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో కలిసి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. సాధారణంగా ప్రపంచబ్యాంకు నుంచి నిధులు మంజూరుకావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అయితే ఇక్కడ రాజధానికి కేంద్ర రాష్ట్రాల సహకారం సంపూర్ణంగా ఉండడంతో ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఏడీబీ, ప్రపంచ బ్యాంకు అధికారులు ఈ నెల 27 దాకా అమరావతిలోనే ఉండి అన్ని అంశాలనూ పరిశీలిస్తారు. రాజధాని నిర్మాణంలో ఏయే కాంపోనెంట్‌కు ఎంత మేర రుణం అందించవచ్చో అంచనా వేస్తారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
‘అమరావతిలో ప్రభుత్వం కింద ఎనిమిది వేల ఎకరాల భూమి ఉంది. మేం దిగిపోయే సమయానికి అక్కడ ఎకరం రూ.పది కోట్లు పలుకుతోంది. రాజధాని కొనసాగి ఉంటే ఆ ధర రూ.ఇరవై కోట్లకు చేరేది. అంతవరకే లెక్క వేసినా ప్రభుత్వం వద్ద ఉన్న భూమికి రూ.ఒక లక్షా అరవై వేల కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. ఎవరినీ అడగాల్సిన పని లేకుండా రాజధాని నిర్మాణం జరిగిపోయేది. గతంలో 132 సంస్థలు అమరావతికి వస్తామంటూ ముందుకు వచ్చాయి. ప్రభుత్వం మారినతర్వాత 128 సంస్థలు వెనక్కు వెళ్లిపోయాయి. సింగపూర్ కన్సార్టియం కొనసాగి ఉంటే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించేది. వాళ్లనూ పంపించివేశారు. వారందరినీ మళ్లీ పిలుస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజధాని ఫలానా తేదీకి పూర్తవుతుందని లక్ష్యాలు పెట్టలేమని, అదొక నిరంతర ప్రక్రియ అని తేల్చిచెప్పారు.