ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్ధేశిస్తూ.. చంద్రబాబు భారీ ప్రసంగం ఇచ్చారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఏపీ ప్రజలకు స్వాతంత్య్రం లభించిందని.. ఐదేళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
రాజధాని కూడా లేని పరిస్థితుల్లో 2014లో తాను పాలన ప్రారంభించానని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. 2014-19 కాలంలో పోలవరం, రాజధాని నిర్మాణ పనులు పరుగులు పెట్టించామన్నారు. కానీ గత ప్రభుత్వం ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని.. రాజధాని అమరావతిని పురిట్లోనే చంపడానికి వ్యూహాలు రచించిందని మండిపడ్డారు. గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు.
సూపర్ సిక్స్ హామీల అమలు, పేదల సంక్షేమం, అన్నివర్గాల అభివృద్ధితో పాటు అమరావతి, పోలవరంను పూర్తి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం తెలిపారు. 120కి పైగా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచామని.. త్వరలోనే సూపర్ సిక్స్ హామీలను కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటన చేశారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విజన్ 2047 విడుదలకు రూపకల్పన చేసినట్టు సీఎం వెల్లడించారు. అలాగే వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన శాఖల్ని పునరుద్ధరించేందుకు100 రోజుల ప్రణాళికతో అన్ని శాఖల్లో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హంగు ఆర్భాటాలకు దూరంగా.. ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తామని చంద్రబాబు హమీ ఇచ్చారు.