వైసీపీ హయాంలో తనపై ఏకంగా 17 కేసులు పెట్టారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. కానీ, ఎవరూ ఎప్పుడూ తనపై కేసు పెట్టలేదన్నారు. ఎలాంటి తప్పులు తాను ఏనాడూ చేయలేదన్నారు. మహారాష్ట్రలో ఉమ్మడి ఏపీ ప్రయోజనాల కోసం బాబ్లీ ప్రాజెక్టు వద్ద ధర్నా చేసినప్పుడు.. మాత్రమే తనపై కేసు నమోదైందన్నారు. అలాంటి తనపై తొలిసారి.. వైసీపీ ప్రభుత్వం.. మాజీ ముఖ్యమంత్రి 17 కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందాడని విమర్శలు గుప్పించారు.
తాజాగా ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులపై గత వైసీపీ హయాంలో నమోదైన కేసుల చిట్టాను చంద్రబాబు వివరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చీమకు కూడా అపకారం చేసే వ్యక్తి కాదని.. ఆయన తన సొంత సంపాదనతో వచ్చిన డబ్బులను అనేక మందికి పంచారని.. ఎంతో మందిని చదివిస్తున్నారని.. కౌలు రైతు కుటుంబాలను కూడా ఆదుకున్నారని చంద్రబాబు చెప్పారు.
అలాంటి పవన్ కల్యాణ్‌పై కూడా వైసీపీ దుర్మార్గంగా వ్యవహరించి 7 కేసులు పెట్టిందన్నారు. అనంతపు రం ప్రజలకు తలలో నాలికగా ఉండే జేసీ ప్రభాకర్‌రెడ్డిని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వేధిం చారని అన్నారు. ఆయనపై ఏకంగా 60 కేసులు పెట్టి జైలుకు కూడా పంపించారని.. ఆయన వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్రలు చేశారని దుయ్యబట్టారు. అయినా.. ఆయన కోర్టుల్లో న్యాయ పోరాటాలు చేసి.. ఎదిరించి నిలబడ్డారని తెలిపారు.
ఇక, ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ అరాచకాలను ప్రశ్నించారని.. డాక్టర్ సుధాకర్‌కు అండగా నిలబడ్డారని.. మహిళలకు అండగా నిలిచారని ఆమెపై కూడా కక్ష కట్టారని అన్నారు. ఆమెపై కూడా అనేక కేసులు పెట్టారని చెప్పారు. స్పీకర్‌గా ఉన్న మీపై(అయ్యన్న పాత్రుడు) కూడా.. అనేక కేసులు పెట్టారని చంద్రబాబు అన్నారు. 70 ఏళ్ల వయసులో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని అన్నారు. ఇంత కన్నా దుర్మార్గం ఉంటుందా? అని ప్రశ్నించారు.
టీడీపీ సీనియర్ నాయకుడు, పెద్ద మనిషి యనమల రామకృష్ణుడు ఓ వివాహానికి హాజరైతే.. ఆయనపై కూడా లేని పోని కేసులు పెట్టారని.. వేధించారని చంద్రబాబు చెప్పారు. ఇక, సొంత పార్టీ నాయకుడని కూడా చూడకుండా.. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అలెర్ట్ చేశారన్న అక్కసుతో రఘురామకృష్ణ రాజును లాకప్‌లో పెట్టి కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. వాటిని లైవ్ చూస్తూ.. ఆనందించాడని మాజీసీఎం జగన్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.