ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని మాజీ సీఎం జగన్ నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. కేవలం ప్రతిపక్ష టీడీపీపై కక్ష సాధించాలన్న ఉద్దేశంతో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని అమరావతి అభివృద్ధి కాకుండా జగన్ ఆపేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపద్యంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతి అభివృద్ధి పై స్పెషల్ ఫొకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. సిఆర్డిఏ అథారిటీ బిల్డింగ్ నిర్మాణం సగంలో ఆగిపోగా దానిని చంద్రబాబు ఈరోజు పున:ప్రారంభించారు.
ఈ క్రమంలోనే 2022లో చేసిన ట్వీట్ ను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘‘ఆంధ్రుల రాజధాని అమరావతి, అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది, అమరావతి గెలుస్తుంది, ఇదే ఫైనల్’’ అంటూ 2022 అక్టోబర్ 22న చంద్రబాబు ట్వీట్ చేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత అమరావతికి మళ్ళీ చంద్రబాబు ఊపిరి పోయడం విశేషం. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని, ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసినా అమరావతి మళ్లీ నిలబడిందని చంద్రబాబు చెప్పారు. ఇటుక మీద ఇటుక వేసి ఒకరికి ఒకరు అండగా నిలిచి రాజధాని పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా గత ప్రభుత్వ దమనకాండకు ఎదురొడ్డి ఉద్యమం ద్వారా రాజధాని కలను సజీవంగా ఉంచిన రైతులకు, మహిళలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
సిఆర్డిఏ కార్యాలయం నిర్మాణానికి 160 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయి. 2017లో ఈ ఆఫీస్ నిర్మాణాన్ని 3.6 ఎకరాల విస్తీర్ణంలో జి ప్లస్ సెవెన్ భవనంగా 2,42,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని నిర్ణయించారు. ఆల్రెడీ ఈ భవనం కోసం 61.48 కోట్లు ఖర్చు పెట్టగా మిగతా పనులు పూర్తయ్యేందుకు 160 కోట్లు ఖర్చు కాబోతున్నాయి. తుళ్లూరు మండలం లింగాయపాలెం- ఉద్దండరాయునిపాలెం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో.చంద్రబాబు పూజ నిర్వహించారు. రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం నినాదంతో ముందుకు పోతామని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూల్ లో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు.