ప్రపంచవ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు పేరు పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 అంటూ ఐటీ రంగం సాధించబోతున్న అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక, ఇటీవల వైసీపీ ప్రభుత్వం హయాంలో అక్రమ అరెస్ట్ కు గురైన చంద్రబాబు ఆ తర్వాత మరే రాజకీయ నాయకుడికి సాధ్యం కానీ రీతిలో అఖండ మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబును అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే ప్రకటించింది. దేశవ్యాప్తంగా శక్తిమంతులైన టాప్ టెన్ లీడర్లలో చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారని ఆ మీడియా సంస్థ తెలిపింది. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత చంద్రబాబు ఉన్నారని పేర్కొంది.
చంద్రబాబు తరువాత బీహార్ సీఎం నితీష్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉన్నారని ఆ కథనంలో పేర్కొంది. ఫీనిక్స్ పక్షిలాగా పునర్జన్మ ఎత్తి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారని ఆ కథనంలో ప్రత్యేకంగా రాశారు . రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొని తన పార్టీని అధికారంలోకి తేవడంలో చంద్రబాబు అనుభవం ప్రశంసించదగినదని ఆ కథనంలో పేర్కొన్నారు. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలో మాత్రమే ఇటువంటి చరిత్రాత్మక పునరామనం సాధ్యమని, దానిని చంద్రబాబు నిజ జీవితంలో చేసి చూపించారని ఇండియా టుడే పొగడ్తలతో ముంచెత్తింది.
భారతీయ దేశ రాజకీయాలలో చంద్రబాబు కీలకంగా మారారని ప్రశంసించింది. దేశంలోని అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడింది. జనసేన, బిజెపిలతో కూటమిగా ఏర్పడి టిడిపిని పతనావస్థ నుంచి పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనదని పేర్కొంది. కార్పొరేట్ కంపెనీలతో స్నేహంగా మెలిగే చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో కూడా ఎప్పుడు ముందుంటారని ఆ సంస్థ ప్రచురించిన కథనంలో పేర్కొంది.