ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తడంతో భారీగా నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఏపీ సీఎం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కు భారీగా ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబును నేరుగా కలిసి బాలకృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ స్వయంగా చెక్కులు అందజేశారు. ఆ కోవలోనే తాజాగా చంద్రబాబుకు వరద సాయం చెక్ ను చిరంజీవి ఈ రోజు అందించారు. ఈ సందర్భంగా చిరుపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి రూ.50 లక్షలు, రామ్ చరణ్ రూ.50 లక్షలు, మొత్తం రూ.1 కోటి విరాళం అందించారని, వారిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. “మానవతా సాయం అందించడంలో చిరంజీవి గారు ఎల్లప్పుడూ ముందుంటారు. విపత్తు సమయాల్లో తప్పకుండా తన మద్దతు అందిస్తుంటారు. వరద బాధితుల జీవితాలను పునర్ నిర్మించడంలో చిరంజీవి, రామ్ చరణ్ అందించిన సాయం ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది” అని చంద్రబాబు కొనియాడారు.