విజయవాడ సహా చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో వరద ముంచెత్తడంతో సీఎం చంద్రబాబు స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పదుల సంఖ్యలో గ్రామాలు, కాలనీలు నీట మునిగాయి. అయితే.. బుధవారం మధ్యాహ్నం నుంచి కొంత మేరకు వరద తక్కుముఖం పట్టడంతో నిండా మునిగిన కాలనీలు.. కొంత మేరకు బయట పడుతున్నాయి. అయితే.. వరద తెచ్చిన బురద కారణంగా కాలనీలన్నీ.. బురదలో చిక్కుకున్నాయి. దీంతో బురదను కడుక్కోవడం.. తుడుచుకోవడం ప్రజలకు మరింత ఇబ్బందిగా మారింది.
దీంతో ప్రభుత్వమే ఈ బాధ్యతలను తీసుకుంది. బురదను తొలగించేందుకు నేరుగా 100 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దింపి.. ఇళ్లలో అడుగుల మేరకు పేరుకుపోయిన బురదను తొలగించే పనిని చేపట్టింది. అదేసమయంలో రహదారులపై ఏర్పడిన బురదను మునిసిపల్ సిబ్బంది రాత్రంతా తొలగి స్తూనే ఉన్నారు. శివారు ప్రాంతాలకు కొన్నింటికి.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కొంత వరకు ఉపశమనం లభించింది.
ఈ క్రమంలో బుధవారం రాత్రంతా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పనిచేస్తోంది. సీఎం చంద్రబాబు రాత్రంతా.. కలెక్టర్ ఆఫీసులోనే కూర్చుని.. పరిస్థితిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు తగు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. బురదను తొలగించడంతోపాటు.. విద్యుత్ సరఫరాను పునరిద్ధరించేలా రాత్రికి రాత్రి చర్యలు తీసుకున్నారు. ఇక, ప్రస్తుత సమయంలో సంక్రమిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 12 రకాల మందులతో కూడిన కిట్లను అందిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు మరోరోజు జాగారం చేసి.. మరీ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడం గమనార్హం.