క్లిష్ట సమస్యల్లో ఉన్నప్పుడే.. నాయకుడి ప్రభావం ప్రజలపై కనిపించాలి. నేనున్నానంటూ.. వారికి తోడుగా ఉండాలి. కష్టాల్లో కలిసి పంచుకోవాలి. ఇదే నాయకుడిగా ఎవరినైనా ప్రజల్లో పదికాలాలు నిలబెడుతుంది. అచ్చంగా ఇప్పుడు అదే కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో ప్రజలు ఇదే చెబుతున్నారు. తిరుగులేని నాయకుడిగా ఆయనను పేర్కొంటున్నారు. “ఆయన మొగాడు.. మొనగాడు“ అని వ్యాఖ్యానిస్తున్నారు.
విజయవాడను ముంచెత్తిన వరద.. అనంతర పరిణామాలతో లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లు నీటమునిగాయి. దీంతో వారిని ఆదుకునేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలోనే ఆయన తిరిగారు. ప్రజలకు భరోసా ఇచ్చారు. వందలాది పడవలను తీసుకువచ్చారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. పునరావాసం ఏర్పాటు చేశారు.
ఒక్క రోజు ఆలస్యమైందే తప్ప.. చంద్రబాబు ఎక్కడా ఆలస్యం చేయలేదు. చేయనీయలేదు కూడా. సంపన్నులు ఆదుకోవాలంటూ.. పిలుపునిచ్చారు. దీంతో విరాళాలు ఇబ్బడి ముబ్బడిగా అందాయి. దీనికి తోడు ఆపన్నులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా కదిలి వచ్చాయి. ఇంకేముంది.. ప్రజలకు అందిన ఆహారం.. అందుతూనే ఉంది.. చేయాల్సిన సాయం చేస్తూనే ఉన్నారు. పగలు, రాత్రి తేడాలేదు. ఆపన్న ప్రసన్నుండు.. అన్నట్టుగా చంద్రబాబు సేవలు చేరువయ్యాయి.
ఇప్పుడు ఎటు చూసినా.. ఎక్కడ విన్నా.. చంద్రబాబు మొగాడు.. మొనగాడు.. అనే మాటే వినిపిస్తోంది. కొంత మేరకు నష్టం కలిగినా.. ప్రాణాలతో బయట పడేందుకు.. కారణంగా చంద్రబాబేనని బాధిత ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. ఇది టీడీపీ అభిమానులు, కార్యకర్తలు చెబుతున్న మాట కాదు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా చెబుతున్న మాట. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొంత తెరుపు ఇచ్చిన నేపథ్యంలో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.