విజయవాడ సహా.. పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలు, భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి వరుసగా సీఎం చంద్రబాబు బాధిత ప్రాంతాల్లో కాలికి బలపం కట్టుకుని అన్నట్టుగా తిరుగుతున్నారు. బాధితులకు స్వాంతన ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. నడుములోతు నీటిలోనూ ఆయన వెరవకుండా.. తిరుగుతూ.. బాధితుల సమస్యలు తెలుసుకుంటున్నారు. అనంతరం.. వారికి సాయం అందించడంలోనూ అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల నడవలేని ప్రాంతాలకు జేసీబీ పైనే వెళ్తూ.. బాధితులను కలుసుకుంటున్నారు. పరిస్థితులను తెలుసుకుంటున్నారు.
ఇలా చంద్రబాబు చూపిస్తున్న చొరవకు అందరూ ముగ్ధులవుతున్నారు. 74 ఏళ్ల వయసులో ఆయన ఇలా యువ నాయకుడి గా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం.. నడుములోతు నీళ్లలోనూ వెరవకుంగా కలియదిరగం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదే విషయంపై పలువురు స్పందిస్తున్నారు. తమకు తోచిన మేరకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నా రు. ఈ క్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం.. త్రిదండ్రి రామానుజ జీయర్ సంస్థ అధిపతి.. ప్రముఖ స్వామి రామానుజ చిన్న జీయర్ స్వామి స్పందించారు. చంద్రబాబును చూస్తే.. యువనాయకుడిని తలపిస్తున్నారని ఆయన ప్రశంసించారు. యువ నేతలు కూడా.. గతంలో ఇలా స్పందించలేదని.. వ్యాఖ్యానించారు.(బహుశా.. జగన్ గురించి కావొచ్చు)
వరద ప్రాంతాల్లో స్వయంగా చంద్రబాబు తిరుగుతున్న తీరు చూస్తే.. తమకు ఆశ్చర్యం వేసిందని జీయర్ చెప్పారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్న విషయం తమ దృష్టికి కూడా వచ్చిందన్న జీయర్ స్వామి.. అర్ధరాత్రి వేళ కూడా ముంపు బాధితులను ఓదార్చుతున్న తీరు.. ఆశ్చర్యాన్ని కలిగించింద న్నారు. అత్యంత విపత్కర సమయంలో చంద్రబాబు యువ నాయకుల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారని చెప్పారు. ఎక్కడా నిముషం కూడా వృథా చేయకుండా.. ఆయన బాధితులకు సాయం చేయడంలో ముందున్నారని తెలిపారు. గతంలో విశాఖలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఇలానే స్పందించిన విషయాన్ని జీయర్ స్వామి చెప్పుకొచ్చారు.
ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం నెలకొన్న వరద, భారీ వర్షాలు తొలిగి పోయి.. సాధారణ పరిస్థితులు ఏర్పడాలని తాము కోరుకుంటున్నట్టు జీయర్ స్వామి తెలిపారు. తమ వంతుగా బాధితులను ఆదుకునేందుకు కృషి చేస్తామని.. జీయర్ సంస్థలు ఎప్పుడూ.. బాధితుల పక్షానే నిలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందన్నారు.