ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఓ చిట్టి ప్రాణాన్ని నిలబెట్టి గొప్ప మనసు చాటుకున్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని పాత రాజేశ్వరిపేటలో దేవాన్ష్ అనే మూడేళ్ల బాలుడు కొద్ది రోజుల క్రితం టైఫాయిడ్ బారిన పడ్డాడు. స్థానిక హాస్పటల్స్ లో తల్లిదండ్రులు దేవాన్ష్ కు ట్రీట్మెంట్ చేయించినా కోలుకోలేదు కదా పరిస్థితి మరింత దిగజారింది. జ్వరం తీవ్రత వల్ల బాలుడి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 14 నుంచి 4 శాతానికి పడిపోయింది.
దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో.. కొడుకు దక్కుతాడో లేడో అని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అలాంటి సమయంలో బాలుడి విషయం సీఎం పేషీలో హెల్త్ డిపార్ట్మెంట్ చూసే అధికారుల ద్వారా చంద్రబాబు దృష్టికి వెళ్లింది. వెంటనే రియాక్ట్ అయినా ముఖ్యమంత్రి.. ఎలాగైనా దేవాన్ష్ ప్రాణాలను నిలబెట్టాలని సీఎంఆర్ఎఫ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.
అలాగే ఒక వైద్య బృందాన్ని వెంటనే టైఫాయిడ్ తో బాధపడుతున్న బాలుడి ఇంటికి పంపి అవసరమైన పరీక్షలు చేయించారు. అనంతరం సీఎం పేషీ మెరుగైన చికిత్సకు యుద్ధప్రాతిపదికన ఎల్ఓసి ఇచ్చి నగరంలోని రెయిన్ బో ఆసుపత్రిలో దేవాన్ష్ ను అడ్మిట్ చేశారు. దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితిని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చంద్రబాబు తెలుసుకున్నారు. 11 రోజుల చికిత్స అనంతరం దేవాన్ష్ సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్నాడు. దాంతో సదరు బాలుడి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు ఒక సామాన్య బాలుడి కోసం చొరవ తీసుకుని ఇంత చేయడం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హ్యాట్సాఫ్ సీఎం సార్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.