ఏపీలో పోటెత్తిన వరద కారణంగా నిరాశ్రయులైన వారికి ఆపన్న హస్తం అందించేందుకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తు న్న విషయం తెలిసిందే. ఆయనే స్వయంగా వరద బురదలో దిగి.. బాధితులను పరామర్శిస్తున్నారు. సాయం అందిస్తామని.. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అలుపెరగకుండా.. శ్రమిస్తున్నారు. ఆపన్నహస్తం అందించేందుకు కృషి చేస్తున్నారు. అదేసమయంలో విరాళాలు కూడా సేకరిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలని.. ఆయన స్వయంగా పిలుపునిచ్చారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు విరాళాలతో ముందుకు వస్తున్నారు.
దీనిలో భాగంగా వరద సాయం అందించేందుకు ఏపీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ముందుకు వచ్చింది. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సంబంధించిన ఒక రోజు వేతనాన్ని.. సంఘం నాయకులు చంద్రబాబుకు అందించారు. ఈ మొత్తం రూ.120 కో్ట్లుగా ఉందని పేర్కొన్నారు. నిజానికి ఉద్యోగులు ఎవరైనా.. సర్కారు నుంచి తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. కానీ, ఉద్యోగులు మాత్రం చంద్రబాబు కృషిని, ఆయన అంకిత బావాన్ని చూసి.. తాము కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మరోవైపు.. `బీఎస్సార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ బలుసు శ్రీనివాసరావు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఆయన రూ.1 కోటి విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా.. వరద బాధితులకు రూ.25 లక్షలు విరాళం అందించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు భారీ ఎత్తున విరాళాలు అందించారు. మరోవైపు.. స్వచ్ఛంద సంస్తల నిర్వాహకులు కూడా… తమ వంతు సేవలు చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కార్యరంగంలోకి దిగిన ఫలితమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఇక, చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి హెరిటేజ్ ట్రస్టు ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు చెరో రూ.కోటి చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.. తెలంగాణలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కూడా.. ఒక రోజు వేతనాన్ని అందించింది. ఇది రూ.130 కోట్లుగా ఉండడం గమనార్హం.