ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సరదాగా కాసేపు ఆదివాసీ మహిళలతో కలిసి చంద్రబాబు వారి సంప్రదాయ నృత్యం చేశారు. గిరిజన మహిళలతో చేయి చేయి కలిపి వారిని ఉత్సాహ పరిచారు. ఆ తర్వాత గిరిజనుల సంప్రదాయ కొమ్ము పాగాను చంద్రబాబు ధరించారు. అంతేకాదు, గిరిజనుల సంప్రదాయ వాయిద్యం డప్పు వాయించి వారిని ఉల్లాస పరిచారు.
ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీ ఉత్పత్తులను చంద్రబాబు పరిశీలించారు. ఇటీవల ప్రధాని మోడీ ప్రశంసలు అందుకున్న అరకు కాఫీని చంద్రబాబు టేస్ట్ చేశారు. ఆ తర్వాత గిరిజన మహిళలతో చంద్రబబు ఫొటోలు దిగి వారిని సంతోషపరిచారు. ఈ ఈవెంట్ లో చంద్రబాబు వెంట గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఆదివాసీ మహిళలతో చంద్రబాబు నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సింపుల్ గా ప్రొఫెషనల్ గా ఉండే చంద్రబాబు ఇలా ఆటవిడుపుగా సంప్రదాయ నృత్యం చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది.