ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్.. తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు ప్రత్యర్థుల నుంచి కూడా పొగడ్తలు వచ్చేలా చేస్తున్నాయి. `ప్రజాదర్బార్` వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన లోకేష్.. అనతి కాలంలోనే ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి.. దీనికి పార్టీ కార్యక్రమంగా.. తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా కూడా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దారు. ఆ తర్వాత పెట్టుబడులపై పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. తండ్రి కొడుకులు దావోస్ వెళ్లి.. పెట్టుబడులు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. పలితంగా 7 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్టు సీఎం స్వయం చెప్పారు.
ఇక, తాజాగా విశ్వ విద్యాలయాలకు నియమించిన ఉప కులపతుల వ్యవహారం చంద్రబాబు, లోకేష్ చేసిన కీలక పనుల్లో అత్యంత హైలెట్గా నిలిచింది. విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించడం అంటే.. సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేయడమే అన్నట్టుగా మారిపోయింది. అనేక వత్తిడులు, రాజకీయ సిఫారసులు, పార్టీ నేతల నుంచి ప్రలోభాలు.. ఇలా అనేకం ఉన్నాయి. ఉంటాయి కూడా. అందుకే.. ఒకప్పుడు విశ్వవిద్యాలయాలకు.. ఇప్పటి విశ్వవిద్యాలయాలకు మధ్య చాలా తేడా కనిపిస్తోంది. కేవలం విద్యలకు వేదికలుగా ఒకప్పుడు ఉన్న యూనివర్సిటీలు.. ఇప్పుడు రాజకీయాలకు కేంద్రంగా మారిపోయాయి.
మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో అయితే.. ఆ పార్టీ నాయకులో.. లేదా అనుబంధ విభాగాలకు నాయకులుగా ఉన్నవారినో తీసుకువచ్చి వీసీలుగా నియమించిన పరిస్థితి ఉంది. అందుకే.. వర్సటీలంటే.. కేవలం రాజకీయ కేంద్రాలుఅనే అపప్రదను మూటగట్టుకున్నాయి. కానీ, తాజాగా ఎన్ని వత్తిడులు వచ్చినా.. ఎన్ని రాజకీయ సిఫారసులు వచ్చినా.. రాష్ట్రంలోని కీలకమైన 9 యూనివర్సిటీలకు జరిగిన వీసీల నియామకంలో ఎలాంటి తేడా రాలేదు. అత్యంత ప్రతిభావంతులకే పట్టం కట్టారు.
అంతేకాదు.. తాజాగా నియమితులైన వీసీలకు.. ఎక్కడా రాజకీయ గాలి సోకడం కానీ.. గతంలో రాజకీయాల్లో ఉన్నవారు కానీ.. ఇప్పుడు మద్దతు ఇస్తున్నవారు కానీ లేక పోవడం గమనార్హం. అంతేనా.. కుల, మత, ప్రాంతాల పక్షపాతానికి అతీతంగా కూడా.. ఈ నియామకాలు జరిగాయి. సుదీర్ఘ అనుభవం..వివాదరహితం.. అభ్యుదయ విద్యా విధానం.. అనే మూడు సూత్రాలను ప్రాతిపదికగా చేసుకుని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేసిన ఎంపిక..మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటుండడం గమనార్హం.