విజయవాడ ను వరద బీభత్సం వెంటాడుతూనే ఉంది. తగ్గినట్టే తగ్గి మరోసారి వరద ఉధ్రుతి పెరిగింది. బుడమేరుకు పడిన మూడు గండ్లు పూడ్చి చేసిన ప్రభుత్వం.. ఇక, ఇబ్బంది ఉండదని స్పష్టం చేసిన గంటలోనే భారీ వర్షం ప్రారంభమై.. కొనసాగుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తిరిగి వరద ప్రవాహాలు మొదలయ్యాయి. దీంతో బెజవాడలో మరోసారి వరద తీవ్రత పెరిగింది.
ఇప్పుడిప్పుడే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మెరుగు పడుతోందని ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రకటించింది. అయితే.. ఆవెంటనే ప్రారంభమైన భారీ వర్షం మూడు గంటలుగా కొనసాగుతూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున ప్రవహించడం ప్రారంభమైంది. ఫలితంగా సహాయక చర్యలు నిలిచిపోయాయి. ప్రతి బాధిత కుటుంబానికీ సాయం అందించేందుకు సిద్ధమైన వాహనాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయి.
దీనిపై సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో వరద ప్రభావం పెరు గుతోందని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. పుకార్లు నమ్మరాదని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు విఘాతం కలుగుతున్నా.. సాయం అందరికీ అందుతుందని చెప్పారు. అధికారులు లోతట్టు ప్రాంతాల్లోనే ఉండి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు.
ప్రస్తుతం శివారు ప్రాంతాలైన సింగ్ నగర్, ప్రకాశ్ నగర్, శాంతి నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వరద తీవ్ర పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ఈ ప్రాంతాలపై ప్రభావం పడకుండా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అయితే.. వర్షాలు తగ్గుముఖం పడితే తప్ప.. సహాయక చర్యలు చేపట్టలేమని తేల్చి చెప్పారు. మొత్తానికి బెజవాడను వరదలు వదిలి పెట్టడం లేదు.