తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీపై, బీజేపీపై వార్ డిక్లేర్ చేసిన కేసీఆర్…పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్…సీఎం నితీశ్ కుమార్ తో పాటు పలువురు బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలతో భేటీ అవుతున్నారు.
అంతేగాక, త్వరలోనే జాతీయ పార్టీ కూడా పెట్టే యోచనలో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ ఇన్ చార్ఝ్ బండి సంజయ్ మొదలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వరకు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోన్న బీజేపీ…పలు కీలక నేతలు తెలంగాణలో పర్యటించేలా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి అసోం సీఎం బిశ్వకర్మను ఉత్సవ కమిటీ ఆహ్వానించేలా బీజేపీ ప్లాన్ చేసింది.
వారి ఆహ్వానం ప్రకారం హైదరాబాద్ లో పర్యటించిన బిశ్వకర్మ ఎంజే మార్కెట్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై బిశ్వకర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 30 ఏళ్ల దాకా కేంద్రంలో బీజేపీ సర్కారే ఉంటుందని, విపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల నెరవేరదని ఆయన జోస్యం చెప్పారు. సూర్యుడి మీదో, చంద్రుడి మీదో… లేదంటే సముద్రంలోనో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అవకాశమే లేదని అన్నారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని, ఆ పనిని కొత్తగా కేసీఆర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్ కోల్పోయారని, అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ తిరుగుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కేసీఆర్ ఎక్కడ తిరిగినా గౌరవం లభించదని అన్నారు. సీబీఐ, ఈడీల గురించి మాట్లాడేవారికి అవి అంటే భయముందని అర్థమని శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.