ఆప్ కీలక నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. భగవంత్ మాన్ మద్యం సేవించి విమానం ఎక్కి గొడవకు దిగారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే భగవంత్ మాన్ను విమానం నుంచి సిబ్బంది దించి వేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అధికంగా మద్యం సేవించిన నేపథ్యంలో ఆయన విమాన సిబ్బందితో గొడవపడ్డారని ప్రచారం జరుగుతోంది. దీంతో, ఫ్రాంక్ ఫర్ట్ నుంచి ఢిల్లీ రావాల్సిన లుఫ్తాన్సా విమాన సర్వీసు ఆలస్యమైందని కూడా పుకార్లు వస్తున్నాయి.
దీంతో, మాన్ పై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మాన్ ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా పంజాబీలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అకాళీదళ్ నేత సుఖ్ వీర్ సింగ్ మండిపడ్డారు. అధిక మోతాదులో మద్యం తాగడం వల్లే విమానంలో మాన్ తూలిపోతూ కనిపించారని తోటి ప్రయాణికులు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే విపక్షాల ఆరోపణలను ఆప్ ఖండించింది. ఆ కథనాల్లో వాస్తవం లేదని విమానం సర్వీసులో జాప్యానికి కారణాలను లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ వివరించిందని చెప్పుకొచ్చింది.
ఆ సర్వీసు లేట్ కావడానికి మాన్ కారణం కాదని తమ నేతకు ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ చిట్ ఇచ్చింది. వాస్తవానికి ఆదివారం మధ్యాహ్నం 1:40 నిమిషాలకు ఫ్రాంక్ ఫర్ట్ లో మాన్ విమానం ఎక్కాల్సి ఉంది. ఆ విమానం సాయంత్రం నాలుగున్నర గంటలకు లేటుగా బయలుదేరడంతో ప్రయాణాన్ని మాన్ విరమించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన వేరే విమానంలో ఢిల్లీ వచ్చారని అంటున్నారు. అయితే, స్వల్ప అస్వస్థతకు గురికావడం వల్లే మాన్ మరో విమానాంలో రావాల్సి వచ్చిందని చెప్తున్నారు.