ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత బిజీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ స్థాయి వ్యక్తి రోజు వారీ కార్యక్రమాల్ని పక్కన పెట్టి థియేటరుకు వెళ్లి సినిమా చూడటం అరుదైన విషయమే. ఇదే విశేషం అంటే.. ఆ సీఎం సినిమా చూసి చాలా ఎమోషనల్ అయిపోవడం, మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం ఇంకా చిత్రం. కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై బసవరాజ్ ఇదే చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఆయన్ని అంతగా కదిలించిన సినిమా.. చార్లీ 777. కన్నడ నటుడు, నిర్మాత, రచయిత రక్షిత్ శెట్టి ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. కిరణ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారమే విడుదలై మంచి స్పందన రాబట్టుకుంటోంది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రూపొందించారు. బాధ్యత లేకుండా తిరిగే ఓ కుర్రాడికి, ఒక కుక్కకు మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ఇది.
ట్రైలర్ చూసే ‘చార్లీ 777’ స్పెషల్ మూవీ అని, మంచి ఫీల్ ఉంటుందని, భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉంటాయని అర్థమైంది. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. పెట్ లవర్స్‌కు సినిమా బాగా నచ్చేస్తోంది. ఆ వర్గం వారంతా సినిమా చూసి చాలా ఎమోషనల్ అయిపోతున్నారు కూడా. ఆ జాబితాలోకి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై కూడా చేరారు. ఆయన కూడా శునక ప్రేమికుడే.
తన ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క చనిపోతే దానికి అంతిమ సంస్కారాలు చేస్తూ బోరున ఏడుస్తున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘చార్లీ 777’ చూసి ఆయనకు తన కుక్క గుర్తు వచ్చి ఉండొచ్చు. అందుకే మీడియా ముందు ఏడుస్తూ సినిమా గురించి మంచి మాటలు చెప్పారు. ఈ సినిమాతో నటుడిగా, నిర్మాతగా రక్షిత్‌కు ఉన్న బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. అతను గతంలో రష్మిక మందన్నాతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం, తర్వాత ఆమెతో విడిపోవడం తెలిసిందే.