టాలీవుడ్ స్టార్ హీరోల్లో రవితేజ సూపర్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు మూడు రిలీజ్లు ఉండేలా చూసుకుంటాడు మాస్ రాజా. గత ఏడాదిన్నర వ్యవధిలో ఐదు సినిమాలతో పలకరించాడు రవితేజ. వేసవిలో రావణాసురతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. దసరాకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రావాల్సి ఉంది. ఐతే ఈ సినిమా గురించి ఈ మధ్య ఏ అప్డేట్ లేదు.షూటింగ్ గురించి కూడా ఏ సమాచారం లేదు. అసలు ఈ సినిమా ఆగిపోయిందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
సినిమా ఉన్నా కూడా దసరాకు రిలీజ్ డౌటే అన్న చర్చ నడుస్తోంది. ఈ ప్రచారానికి తెరదించుతూ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఒక నోట్ రిలీజ్ చేశాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా.. అక్టోబర్ 20న విడుదల కావడం లేదని నిరాధారమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని శక్తులు ఈ రూమర్లని ప్రచారం చేస్తున్నాయి. ఎందుకంటే మా చిత్రం ప్రేక్షకుల్లో గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. థియేట్రికల్ ఎకోసిస్టమ్‌లోని వివిధ స్టేక్ హోల్డర్స్ మా సినిమాకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ సినిమా విడుదల విషయమై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మవద్దు. మీకు అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాము. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్ ఈ నోట్లో స్పష్టం చేశారు. ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో దోపిడీలతో హడలెత్తించిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రాల దర్శకుడు వంశీ ఆకెళ్ల దీనికి డైరెక్టర్. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తోంది.