మన దేశంలో ఎన్నికలంటే ఓటర్లకు ఓ పండుగ. ఐదేళ్లకోసారి వచ్చే ఈ పండగను ఓట్లతో, నోట్లతో జరుపుకోవడం రాజకీయ నేతలకు, ఓటర్లకు అలవాటే. ఇక, ఎన్నికలకు ముందు జనాన్ని ఆకట్టుకోవడానికి మన నేతాశ్రీలిచ్చే అడ్డగోలు అలివిగాని అమలు చేయలేని హామీల చిట్టా అయితే కొండవీడు చాంతాడంత ఉంటుంది. ఈ మధ్యకాలంలో అయితే సీఎం జగన్ వంటి ఇంటెలిజెంట్ పొలిటిషియన్లు, పీకే వంటి పొలిటికల్ స్ట్రేటజిస్ట్ లు ఆండ్రాయిడ్ వెర్షన్ ల మాదిరిగా అప్డేట్ అయ్యారు.
పప్పు బెల్లాల్లాగా చాలామంది జనం కట్టిన పన్నుల సొమ్ముతో ఉచిత పథకాలను రూపొందించి ఓటర్లను వలలో వేసుకొని ఓట్లు దండుకుంటూ అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఉచిత హామీలు, పథకాలపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఉచిత హామీలివ్వడం అత్యంత తీవ్రమైన సమస్య అని సీజేఐ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు.
ఆ హామీల వల్ల ఎన్నికలు ప్రభావితమవుతాయని, ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తోందని అన్నారు. గతంలో ఉచిత హామీలపై మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చామని, ఆ తర్వాత ఈసీ ఏం చర్యలు తీసుకుందో తమకు తెలీదని అన్నారు. ఉచిత హామీలు రాజ్యాంగ విరుద్ధమని, ఆ హామీలిచ్చే పార్టీలను రద్దు చేయాలని ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఉచిత హామీల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, ప్రతి ఒక్కరిపై రూ.3 లక్షల రుణభారం పడిందని పిటిషన్ దాఖలైంది. కానీ, ఉచిత హామీలిచ్చినంత మాత్రాన వాటిని ‘అవినీతి ఎన్నికలు’ అని చెప్పలేమనీ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సాధారణ బడ్జెట్ కంటే ఉచిత హామీల బడ్జెట్ ఎక్కువైపోతోందని, దీనిపై 4 వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులిచ్చింది.