తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, హైకోర్టు సీజే ఆదేశాలను సోమేశ్ కుమార్ అమలుచేయడం లేదని సీజీఐ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, హైకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలులో సోమేశ్ కుమార్ జాప్యంపై మండిపడ్డారు. న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నామని, వాటి అమలులో జాప్యం వల్ల కోర్టుల్లో దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయని సీజేఐ ఎన్వీ రమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు, న్యాయమూర్తులు విధి నిర్వహణలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలని, దానిని దాటడం మంచిది కాదని జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు. విధి నిర్వహణలో జడ్జిలు తమ పరిధిని గుర్తుంచుకోవాలని, శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్వవస్థలకు వేర్వేరు అధికారాలున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం బలోపేతానికి మూడు వ్యవస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని తెలిపారు.
ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దుర్వినియోగమవుతున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లను కొందరు తమ వ్యక్తిగత వ్యాజ్యాలుగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సదస్సులో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో కేసీఆర్ కు బదులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. దీంతో, సీజేఐ వ్యాఖ్యలను నోట్ చేసుకున్నామని, వాటిపై పరిశీలన చేస్తామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.