దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్వీ రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో చట్టసభ్యులుగా ఉన్నవారిలో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని గుర్తు చేశారు. అప్పట్లో వారంతా ప్రతి అంశంపైనా విస్తృతంగా, నిర్మాణాత్మకంగా చర్చించి, చట్టాలు చేసేవారని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న దేశపరిణామాలపై చురకలు అంటించారు.
పార్లమెంటు చట్టాలు చేసే సమయంలో సరైన చర్చ జరుగుతున్నట్టు కనిపించడం లేదని జస్టిస్ ఎన్.వి. రమణ అభిప్రాయపడ్డారు. అర్థవంతమైన చర్చ జరగని కారణంగా ఆ చట్టం చేయడం వెనుక ఉద్దేశం ఏంటో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా అనేక వివాదాలు తలెత్తి.. ప్రభుత్వానికి, ప్రజలకు అసౌకర్యంగా మారుతుందని వ్యాఖ్యానించారు.
గతంలో న్యాయస్థానాలపై కేసుల భారం తక్కువగా ఉండేది. ఎందుకంటే.. అప్పట్లో ప్రతి చట్టంపైనా స్పష్టత ఉండేది. ఆ చట్టాలను అర్థం చేసుకోవడంలో, అమలు చేయడంలో ఇబ్బందులు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. చట్టాల్లో అనేక లోపాలు ఉంటున్నాయి. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో స్పష్టత ఉండడంలేదు. ఫలితంగా కేసులు ఎక్కువై.. ప్రభుత్వానికి, ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది.. అని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.
చట్టసభల్లో మేధావులు, న్యాయవాదులు లేకపోతే ఇలానే జరుగుతుందన్న ఆయన.. అందుకే.. సామాజిక, ప్రజా జీవితంలో న్యాయవాదులు మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. `మీ(న్యాయవాద) వృత్తికి, డబ్బు సంపాదించి సుఖంగా జీవించాలన్న ఆలోచనకే పరిమితం అవ్వకండి. ఆలోచించండి. ప్రజా జీవితంలో చురుకుగా ఉండండి. మీ వంతు మంచి పనులు చేయండి. దేశానికి మంచి జరుగుతుంది` అని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.
మొత్తంగా జస్టిస్ రమణ ప్రసంగంలో.. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. పార్లమెంటులో ముఖ్యంగా పెద్దల సభలో రణరంగం చోటు చేసుకోవడం.. సాక్షాత్తూ.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కన్నీటిప ర్యంతం కావడం.. దీనిపై ఎంపీలు, ప్రభుత్వం బహిరంగ సవాళ్లు రువ్వుకోవడం.. వంటివి 75వ స్వాతంత్య్ర దినోత్స వేళ.. పెద్ద మచ్చగా మారాయని మేధావులు భావిస్తున్న సమయంలో జస్టిస్ రమణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.