ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కు షాక్ తగిలేలా సీఐడీ చర్యలు చోటు చేసుకున్నాయి. ఆయనకు చెందిన రామోజీ గ్రూపులోకీలకమైన మార్గదర్శికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు సోదాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన సోదాలతో ఎలాంటి ఆధారాలు లభించలేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (శనివారం) అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఏపీ వ్యాప్తంగా తనిఖీలను నిర్వహించారు. మార్గదర్శి మేనేజర్లు..కీలక అధికారుల ఇళ్లలో సోదాల్ని నిర్వహిస్తున్నారు. చిట్ ఫండ్ చట్టాల్నిఉల్లంఘిస్తూ.. ఖాతాదారుల సొమ్మును మళ్లిస్తున్నారని.. నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచులకు సంబంధించిన మేనేజర్ ఇళ్లలో తనిఖీలను చేపట్టారు.
ఇంతకీ సోదాల్ని ఎందుకు చేపట్టారు? ఎవరి ఫిర్యాదు చేశారు? అన్న ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కంప్లైంట్ చేసినట్లుగా చెబుతున్నారు. సీఐడీకి అందిన సమాచారంతో ఈ తనిఖీలను చేపట్టినట్లుగా చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సోదాలు.. మార్గదర్శి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి. మొత్తంగా ఈ చర్య ఏపీలోని జగన్ ప్రభుత్వానికి.. ఈనాడు రామోజీకి మధ్య మరింత దూరాన్ని పెంచుతుందన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.