జగన్ పై, వైసీపీ నేతలపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించడం, ఈ క్రమంలోనే రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు చేరడంతో…జగన్ అండ్ కో సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత పిలిచినపుడు విచారణకు రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. కానీ, ఇంతవరకు రఘురామకు సీఐడీ నోటీసులివ్వలేదు. ఇక, తాజాగా ఈ నెల 13న తాను నరసాపురం వెళుతున్నానని రఘురామ ప్రకటించడంతో…మరోసారి ఆర్ఆర్ఆర్ పై కక్ష సాధించేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలోనే రేపు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్ లో ఉన్న రఘురామకు సీఐడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. పండుగకు తాను వస్తున్నానని తెలిసే…పండుగ రోజుల్లో నోటీసులిస్తున్నారని రఘురామ మండిపడ్డారు. సీఐడీ సునీల్ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కానీ, చట్టాన్ని తాను గౌరవించి విచారణకు హాజరవుతానన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లిన నలుగురు సీఐడీ అధికారులు…ఈ రోజు నోటీసులిచ్చి రేపు గురువారం విచారణకు రావాలని చెప్పారు.
అయితే, ఇవాళ నోటీసులిచ్చి రేపు రమ్మనడంపై రఘురామ అభ్యంతరం తెలిపారు. దీంతో 17వ తేదీన విచారణకు రావాలని చెప్పారని రఘురామ వెల్లడించారు. సంక్రాంతికి భీమవరం వెళ్తున్నానని తెలిసి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఇదంతా చూసి జగన్ ఆనందపడుతున్నారని మండిపడ్డారు. సీఐడీ తీరు అనుమానాస్పదంగా ఉందని, దానిపై ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని, రావణ రాజ్యంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు.