జగన్ సీఎం అయిన తర్వాత టీడీపీ నేతలను రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిడిపికి వెన్నుదన్నుగా నిలిచిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పొంగూరు నారాయణ వంటి నేతలను లక్ష్యంగా చేసుకొని జగన్ అక్రమ కేసులు బనాయిస్తున్నారని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం, అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పుతోపాటు టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ నారాయణపై ఇప్పటికే ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లేందుకు నారాయణ కోర్టు నుంచి బెయిల్ పొంది చికిత్స చేయించుకున్నారు. ఆ గడువు ముగిసిన వెంటనే తాజాగా నారాయణను టార్గెట్ చేసుకొని మరోసారి వైసీపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నారాయణకు తాజాగా సీఆర్పీసీ 41 కింద ఏపీ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మార్చి 6వ తేదీన విచారణకు హాజరు కావాలని నారాయణ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
నారాయణతో పాటు రామకృష్ణ హౌసింగ్ ఎండి అంజనీ కుమార్ కు కూడా సిఐడి నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఆ ముగ్గురు మార్చి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం నారాయణతో పాటు ఆయన కుమార్తెల ఇళ్లలో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఇక, తన సంస్థలోని కొందరు ఉద్యోగుల పేరు మీద కూడా నారాయణ భూములు కొన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 148 ఎకరాల అసైన్డ్ భూమి కొనుగోలు చేసి తమ వారికి అనుకూలంగా సిఆర్డిఏ ప్లాన్, అమరావతి మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్, డిజైన్ మార్చినట్టుగా నారాయణ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారంటూ 2020లో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నారాయణపై కేసు నమోదు అయింది.