జగన్ హయాంలో ఏపీలో క్రిష్టియానిటీ పెరుగుతోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఏపీలో మతమార్పిడులపై దృష్టిసారించాలని, వాటిని అడ్డుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా రఘురామ లేఖ రాయడం గతంలో సంచలనం రేపింది.
ఏపీలో రికార్డుల ప్రకారం 1.8 శాతం క్రిష్టియానిటీ ఉందని, కానీ, వాస్తవానికి అది 25 శాతం ఉందని రఘురామ ఆరోపించారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు క్రిష్టియన్లని, కానీ,ఎన్నికలలో గెలిచేందుకు హిందువులమని చెప్పుకుంటూ నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన బావ బ్రదర్ అనిల్ కుమార్ సాయంతో ఏపీలో జగన్ మతమార్పిళ్లు చేయిస్తున్నారని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. మతమార్పిళ్ల ద్వారా రాష్ట్రంలో క్రైస్తవ ఓటు బ్యాంకును జగన్ పెంచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఏపీలో బ్రిటీష్ వారిని మించి క్రైస్తవ పాలన కొనసాగుతోందని, చాపకింద నీరులా హిందూ మతాన్ని నాశనం చేసేందుకు జగన్ కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికే శ్రీశైలం అన్యమతస్తుల చేతికి వెళ్లిపోయిందని, గతంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు హిందువుల మనసులను గాయపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ఆలయాలపై దాడులకు సంబంధించి అరెస్టులు లేకపోవడం దారుణమని, హిందూమత రక్షణ గురించి మాట్లాడినందునే ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అవమానకర రీతిలో సాగనంపారని ఆరోపించారు.
తిరుపతి ఉప ఎన్నికలో జగన్ ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పాలని, హిందువుల మనోభావాలను గౌరవించే పార్టీకి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మనా లేక సర్వమత ప్రతినిధా అని శ్రీనివాసానంద ప్రశ్నించారు. తిరుమలలో ఉచిత దర్శనాన్ని రద్దు చేసి రూ.300 దర్శనాలు కొనసాగించడం వారి వ్యాపార ధోరణికి నిదర్శనమని అన్నారు.