వాల్తేరు వీరయ్య చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి పవన్ అని, మొన్నటి వరకు పవన్ కు సొంతిల్లు కూడా లేదని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న సత్ససంకల్పంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని, రాజకీయ ప్రక్షాళనకు పవన్ పూనుకున్నాడని కితాబిచ్చారు. అయితే, పవన్ ను కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అటువంటి వారితో తాను మాట్లాడాల్సి వచ్చినపుడు ఇబ్బందిగా ఉంటుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ పై విమర్శలు తనను ఎంతో బాధిస్తాయని, పవన్ ను తాను ఓ బిడ్డలా భావిస్తానని, తమ కుటుంబంపై పవన్ కు ఎంతో ప్రేమ అని చిరు అన్నారు. ఇక, అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన చిరు…డిసెంబర్ 31న తాను అందరిలా పార్టీలకు వెళ్లేవాడిని కాదని, రాత్రి 11.30 నుంచి పూజ గదిలో ఆంజనేయస్వామి ముందు కూర్చుని ధ్యానం చేసుకొనేవాడినని గుర్తు చేసుకున్నారు. 12 గంటల తర్వాత టపాసుల చప్పుడు అయినప్పుడు లేచి అందరికీ శుభాకాంక్షలు చెప్పేవాడిని గుర్తు చేసుకున్నారు.
తన భార్య సురేఖ ఇప్పటికీ ఇదే సంప్రదాయం కొనసాగిస్తోందని అన్నారు. తన కుమారుడు చరణ్ తనలాగే అందరూ తన కుటుంబమే అనుకుంటాడని చిరు చెప్పారు. చరణ్ చాలా గుంభనంగా ఉంటాడని, తాను చాలా ఓపెన్‌గా ఉంటానని అదొక్కటే తమిద్దరికీ తేడా అని అన్నారు. చరణ్–ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం తెలిసి చాలా సంతోషపడ్డానని, ఆరేళ్ల నుంచి ఆ మాటకోసం వేచి చూస్తున్నామని అన్నారు.