మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకేలా ఇలా ఒక చిన్న విమర్శ చేశారో లేదో.. కాసేపటికే ఆయనపై తీవ్రమైన ఎదురు దాడి మొదలైపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’లో పెట్టుబడుల గురించి.. ఆ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషకం గురించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు అనేక ఆరోపణలు చేయడం.. అదే సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో మాట్లాడుతూ.. సినిమా హీరోల రెమ్యూనరేషన్లను నియంత్రించాలని అసందర్భ ప్రసంగం చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రత్యేక హోదా.. మనకి రావాల్సిన ప్రాజెక్టులు.. రోడ్ల నిర్మాణం లాంటి పెద్ద విషయాల మీద దృష్టిపెట్టాలని.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు సినిమా హీరోల పారితోషకాల గురించి ఎందుకని చిరు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆయనేమీ ఏపీ ప్రభుత్వం అంటూ ప్రత్యేకంగా పేర్కొనలేదు కానీ.. ఈ వ్యాఖ్యలు నేరుగా తాకింది మాత్రం జగన్ సర్కారుకే. ఐతే ఇన్నాళ్లూ పవన్‌ను తిడుతూ కూడా చిరుకు ఎలివేషన్ ఇస్తూ.. ఆయన గురించి సానుకూలంగా మాట్లాడుతూ వచ్చిన వైసీపీ వాళ్లు.. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా స్వరం మార్చేశారు.
చిరును వైసీపీ సోషల్ మీడియా ఆల్రెడీ బూతులు తిట్టేస్తోంది. ‘మెగా బ్రోకర్స్’ అంటూ ఏదో హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ చిరును టార్గెట్ చేస్తున్నారు. ప్రజారాజ్యం రోెజుల నాటి వీడియోలను బయటికి తీస్తున్నారు. మరోవైపు వైసీపీ ముఖ్య నేతలు సైతం చిరు మీద పడిపోయారు. కొడాలి నాని.. కొందరు పకోడీగాళ్లు మాకు సలహాలు ఇస్తున్నారు, ముందు మీ సినిమా వాళ్లకు సలహాలు ఇచ్చుకోండి అంటూ పరోక్షంగా చిరు మీద కౌంటర్లు వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని చిరు అన్నారంటే ఫిలిం ఇండస్ట్రీ పిచ్చుకేనా అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. చిరుకు తాను అభిమానినే అని.. అలా అని తమను గిచ్చితే ఊరుకోమని ఆయన మీద విమర్శలు చేశారు. జగన్ పట్ల విధేయతతో ఉంటే ఓకే కానీ.. చిన్న విమర్శ చేసినా దాడి ఏ స్థాయిలో ఉంటుందో వైసీపీ వాళ్లు మెగాస్టార్‌కు రుచి చూపిస్తున్నారు. అయితే, జనసేనలోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చేందుకే ఈ తరహా కామెంట్లు చేశారని సోషల్ మీడియాలో టాక్ వస్తోంది.