గత కొద్దిరోజులుగా ఏపీలో సినిమా టిక్కెట్ ధరల విషయమై కొంతకాలంగా రచ్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. టిక్కెట్ రేట్లు తగ్గించడంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేస్తుండగా…ప్రభుత్వం మాత్రం పేదలకు పెద్ద పీట వేసేందుకు టికెట్ రేట్లు తగ్గించామని చెబుతోంది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం జగన్ తో చిరంజీవి భేటీ కావడం చర్చనీయాంశమైంది. అయితే, ఆ సమావేశం తర్వాత ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని భావించారు.
కానీ, అలా జరగలేదు. ఇండస్ట్రీ పెద్దగా రాలేదని, ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చిరు చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వంపై ఇండస్ట్రీ తరఫున అనవసరంగా విమర్శలు చెయ్యవద్దంటూ హుకుం జారీ చేశారు. తీరా ప్రభుత్వం తరఫున చిరు అంత వకాల్తా పుచ్చుకుంటే….మంత్రి పేర్ని నాని మాత్రం చిరు గాలి తీశారు. జగన్ భోజనానికి పిలిస్తే చిరు వచ్చారని, మాటలతో పాటు భోజనాలు వడ్డించారని…ఆ సమయంలోని మాటల వడ్డింపులు లెక్కలోకి రావని తేల్చిపడేశారు. దీంతో, జగన్ తో చిరు మరోసారి భేటీ అవుతారని అప్పట్లో టాక్ వచ్చినా…చిరు కరోనా బారిన పడడంతో ఆ మీటింగ్ జరగలేదు.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ తో చిరు మరోసారి భేటీ కాబోతున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి10 న ఈ మీటింగ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోసారి సినిమా టిక్కెట్ల రేట్లపై జగన్ తో చిరు మాట్లాడబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, జగన్ తో భేటీకి ముందు సినీ ఇండస్ట్రీ పెద్దలతో చిరు సమావేశం కానున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, గతంలో జగన్ వడ్డింపు చిరుకు నచ్చలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. తాజాగా భేటీ వార్తల నేపథ్యంలో ఈ సారి వడ్డింపు చిరుకు బాగా నచ్చుతుందని సెటైర్లు పేలుతున్నాయి.