ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ భారతదేశంపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసిరిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లో చాలామంది కరోనా రోగులు సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్రంగా కలచివేశాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆక్సిజన్ సిలెండర్లు, కాన్సంట్రేటర్లను ఆస్పత్రులలో ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అన్ని జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే తొలి విడతలో భాగంగా నేడు అనంతపురం, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ రోజు సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు చిరంజీవి చారిటేబుల్ ట్రస్ట్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో నేడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి.
ఆక్సిజన్ బ్యాంకు మిషన్ ప్రారంభమైందని, ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని చిరు అన్నారు. తన ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంని చిరంజీవి తెలిపారు. చైనా నుంచి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆర్డర్ చేశామని ,ఆక్సిజన్ అవసరం ఎక్కడ ఉందో తెలుసుకొని సిలిండర్లు అందిస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు రాం చరణ్ ఎంతో కృషి చేశాడని చిరు అన్నారు.